అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు. భీమవరంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమని ఆయన తెలిపారు. దేశానికే గర్వకారణమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని, పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు.
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరుపుకోవడం తెలుగుజాతితో పాటు దేశానికే గర్వకారణమని బాబు పేర్కొన్నారు. 1897 జులై 4వ తేదీన జన్మించిన అల్లూరి తన జీవితాన్ని పోరాటాలకే అంకితం చేశారని అన్నారు.చిన్న వయస్సులోనే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన ధీరుడు అల్లూరి అని ఆయన కొనియాడారు. మన్యం ప్రాంతంలోని గిరిజనులను సమీకరించి బ్రిటిష్ వారినే గడగడలాడించేలా అల్లూరి సాయుధ పోరాటంతో ముందుకు సాగారని గుర్తుచేశారు.
అల్లూరి పోరాటాలను ఎదుర్కోలేక, ఆయన్ని ఎలాగైనా బండించాలని ఆ రోజుల్లోనే బ్రిటిష్ వారు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. విశాఖ కేంద్రంగా ప్రజలను చైతన్య వంతులను చేస్తూ తన పోరాటాలను ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. అలాంటి మహనీయుడు 27 ఏళ్ల చిన్న వయస్సులోనే దేశం కోసం బ్రిటిష్ వారి చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని.. ఆయన ప్రజలకు భౌతికంగా దూరమైనా, ఆయన పోరాటాలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాయని తెలిపారు.
దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి పోరాటానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. తగిన గుర్తింపు రాలేదని చంద్రబాబు పేర్కొన్నారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. అల్లూరి లాంటి మహనీయుల త్యాగాలను గుర్తించి ప్రధాని మోడీ స్వయంగా రాష్ట్రానికి వచ్చి నివాళులు అర్పించడం సముచితమైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.దీన్ని తెలుగుదేశం పార్టీ పరంగా, వ్యక్తిగతంగానూ ఆయన స్వాగతిస్తున్నానని వెల్లడించారు.అదేసమయంలో పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన పోరాటాలకు, త్యాగాలకు తగిన గుర్తింపునివ్వాలని చంద్రబాబు కోరారు.