ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో కనీసం రాజధాని కూడా లేకుండానే నవ్యాంధ్రప్రదేశ్ ప్రస్థానం మొదలుపెట్టింది. అయితే టీడీపీ సర్కారు తీసుకుంటున్న చర్యలతో అనతి కాలంలోనే మహా నగరాలను తలదన్నేలా సరికొత్త హంగులతో కూడిన నూతన రాజధానిని ఏపీ నిర్మించుకునే పనిలో నిమగ్నమైంది. 2014లో రాష్ట్ర విభజనతో అమరావతిని నూతన రా.జధానిగా ఎంపిక చేసిన నాటి ఏపీ సీఎం నారాచంద్రబాబునాయుడు… అనతి కాలంలోనే అందులో సచివాలయం, శాసనసభ సముదాయం, హైకోర్టు, అధికారులు, ఎమ్మెల్యేల గృహ సముదాయాలను ఏర్పాటు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో..అమరావతి నిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోయింది.
అయితే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి టీడీపీ విజయం సాధించగా… చంద్రబాబు మరోమారు ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతానుభవాల నేపథ్యంలో చంద్రబాబు అమరావతి నిర్మాణంలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే తెర వెనుకే చక్రం తిప్పుతున్న చంద్రబాబు…బడా కార్పొరేట్ కంపెనీలు అమరావతి బాట పట్టేలా చేస్తున్నారు. చంద్రబాబు చేపట్టిన ఈ చర్యల్లో భాగంగా…బహుళజాతి కార్పొరేట్ దిగ్గజం ఫాక్స్ కాన్…అమరావతిలో భారీ ఎత్తున ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో దిగ్గజ కంపెనీగా ఉన్న ఫాక్స్ కాన్… అమరావతిలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందట. ఏపీ అధికారిక వర్గాల సమాచారం మేరకు… అమరావతిలో ఫాక్స్ కాన్ సిటీ పేరిట సదరు కంపెనీ తన సామాజ్రాన్యి విస్తరించనుంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, డిజైనింగ్లతో పాటు డిజిటల్ హెల్త్ రంగాల్లో కార్యకలాపాలు సాగించనుంది. ఇందుకోసం ఫాక్స్ కాన్ ఏకంగా రూ.60 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఒకే సంస్థ ఈ మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధ పడితే…ఇతర కంపెనీలు కూడా అమరావతివైపు ఆసక్తి పెంచుంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతిలో ఫాక్స్ కాన్ సిటీ రూపుదాలిస్తే…ఇప్పటికే సకల హంగులతో అలరారుతున్న కాస్మోపాలిటిన్ సిటీలను తలదన్నేలా అమరావతి విరాజిల్లుతుందన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. అదే జరిగితే…చంద్రబాబు మార్గదర్శనంలో మహానగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ కూడా అమరావతి ముందు దిగదుడుపేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి.