టీడీపీ యువనేత, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి రెడ్‌బుక్ డైరీ అమలుపై స్పష్టత ఇచ్చారు. తాను ప్రజాగళం పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతామన్నారు. ఎవరో భయపడుతున్నారనో.. లేకపోతే ఇంకేదో జరుగుతుందనో రెడ్‌బుక్ డైరీ అమలును ఆపేది లేదన్నారు. భూకబ్జాలు చేసిన వారు.. చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్‌పై యాక్షన్ తప్పకుండా ఉంటుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ సమయంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపైనా లోకేష్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వరదలొస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు కూడా బయటపెట్టలేదన్నారు. కానీ ఇప్పుడు మాత్రం వరద సాయంపై ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం మంగళగిరి పరిధిలోని కొలనుకొండలో కియా షోరూమ్ ప్రారంభించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పరదాలు కట్టుకునే అలవాటు మాకు లేదు.. ప్రభుత్వంపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసేవాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దీనిలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రెడ్‌బుక్‌లో పేరుందని వైసీపీ నేతలు భయపడుతున్నారు. భూకబ్జాలు చేసిన వారు, చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్‌పై యాక్షన్ అనివార్యం. చర్యలు తీసుకుంటామని పాదయాత్ర సమయంలో ఊరూరా చెప్పాను.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ వారు ఏ బుక్ మెయింటెన్ చేసినా తమకేమీ ఇబ్బంది లేదన్నారు. ఏం జగన్.. నా రెడ్ బుక్ చూసి ఇన్ స్పయిర్ అయ్యావా.??. దానిని ఫాలో అవుతున్నావా..?? అని చురకలు అంటించారు లోకేష్..
ఉత్తరాంధ్రలో సేవల రంగానికి చెందిన సంస్థలను.. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలను తీసుకొస్తామన్నారు మంత్రి నారా లోకేష్. గోదావరి జిల్లాల్లో ఆక్వా, పెట్రో కెమికల్స్‌ను ఏర్పాటు చేస్తామని.. రాజధాని ప్రాంతం ఉన్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు అనేక పెట్టుబడులు వస్తాయన్నారు. రాష్ట్ర పాలన ఒకే చోట ఉండాలి.. కానీ అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ జరగాలన్నది మా ప్రభుత్వ సిద్ధాంతమన్నారు.
జగన్ జిల్లాల పర్యటనకు వెళ్తే చట్ట ప్రకారం అనుమతులు ఇస్తామని.. శాంతిభద్రతలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలుంటాయన్నారు. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేపట్టనున్నట్టు తెలిపారు. త్వరలోనే మరో జాబితా విడుదల చేయాల్సి ఉందని… పార్టీకి సేవ చేసిన నేతల పనితీరుపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.