ఏపీ రాజధాని అమరావతి తరలింపు, మూడు రాజధానుల ప్రకటన, సీఆర్డీయే రద్దుపై రైతులతో పాటు అనేక మంది వేసిన కేసులు మే 3 నుంచి హైకోర్టులోనే భౌతికంగా రోజువారీ విచారణ జరపాలని హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ ధర్మాసనంలో ఏపీ హైకోర్టు సీజే ఏకే గోస్వామి, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ జయసూర్య ఉన్నారు. రాజధాని కేసులపై మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. మొత్తం రాజధానిపై 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో 63 విచారణకు వచ్చాయి. మొదటి నుంచి రాజధాని కేసులు విచారించిన న్యాయమూర్తుల్లో ఒకరు పదవీ విరమణ చేశారు. మరొకరు బదిలీపై వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉన్న ముగ్గురు ధర్మాసనంలో ఒక్కరే పాతవారు. అందువల్ల కేసులు మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.
ఆగష్టు వరకు కొనసాగే అవకాశం
రాజధాని కేసులు రోజువారీ విచారణ జరిగినా రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు మేలో కోర్టులకు వేసవి సెలవులు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే అమరావతి రాజధాని కేసుపై తీర్పు రావడానికి కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మే నెలలో కొద్ది రోజులే కోర్టులు పనిచేస్తాయి. ఆ తరవాత జూన్ నుంచి పూర్తి స్థాయిలో రాజధాని కేసు విచారణ జరగనుంది.











