ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లకు సంబధించిన డీటెయిల్డ్ డిజైన్లు ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. లండన్‌కు చెందిన ఫోస్టర్స్ సంస్థ ఈ డిజైన్స్‌ను రూపొందిస్తుంది. అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ సముదాయంలో వేర్వేరుగా నిర్మిస్తున్న 5 టవర్లను బ్రిడ్జితో ఒక దానితో మరోదానిని కనెక్ట్ చేయనున్నారు.స్టీల్‌తో నిర్మించే డయాగ్రిడ్ ఆకృతులను అమరావతిలోనే బిగించనున్నారు.
రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తాన్ని ఒకే గొడుకు కిందకు తెచ్చేలా అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మొత్తం ఈ 5 టవర్లను 68 లక్షల 88 వేల 64 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. GAD టవర్‌ని బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఇందులోనే ముఖ్యమంత్రి కార్యాలయం రానుంది. దీని టెర్రస్‌పై హెలిప్యాడ్‌ను నిర్మిస్తారు. మిగిలిన నాలుగు HOD టవర్లు 39 అంతస్తులతో నిర్మించనున్నారు.
థర్డ్ ఫ్లోర్‌లో గ్లాస్ బ్రిడ్జి
ఒక టవర్ నుంచి మరో టవర్‌లోకి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సందర్శకులు సులువుగా వెళ్లేందుకు వీలుగా గ్లాస్ బ్రిడ్జిని నిర్మిస్తారు. 900 మీటర్ల పొడవుతో ఈ వంతెనను రూపొందించనున్నారు. ఇది మూడో అంతస్తులో రానుంది. టవర్లకు అనుబంధంగా ఎనిమిది ఎమినిటీస్ బ్లాక్‌లు ఒక్కొక్కటి గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మూడు అంతస్తులతో నిర్మిస్తారు. వీటిల్లో సమావేశ మందిరాలు, డిస్పెన్సరీలు, క్రెచ్‌లు, క్యాంటీన్‌లు, లైబ్రరీ సౌకర్యాలు ఉంటాయి. ఈ భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యేక ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం వివిధ దేశాల్లోని నమూనాలను ఇప్పటికే పరిశీలించారు. ప్రతి టవర్ వద్ద 50 మీటర్లు పొడవు, వెడల్పుతో పెద్ద పోర్టికోలు కూడా నిర్మిస్తారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు నీటిలోనే ఉన్న టవర్ల వద్ద నేల సామర్థ్యాన్ని కాంట్రాక్టు సంస్థలు ఇప్పటికే పరీక్షించాయి. 1000 టన్నుల బరువును వేసి పరీక్షించగా సానుకూల ఫలితాలు వచ్చాయి.
ఇక, ఐకానిక్ టవర్ల ఆకృతులు డయాగ్రిడ్ విధానంలో రూపొందించారు. ప్రతి టవర్‌కు సగటున 15 నుంచి 20 వేల టన్నుల మేర స్టీలును వినియోగించనున్నారు. ఇప్పటికే CRDA అధికారులు పలు రాష్ట్రాల్లోని స్టీలు ప్లాంట్స్‌ను సందర్శించారు. టవర్ల పనులను దక్కించుకున్న మూడు కాంట్రాక్టు సంస్థలు అమరావతిలోనే వర్క్‌షాపులను ఏర్పాటు చేసేందుకు CRDA అధికారులను అనుమతి కోరారు. దీనికి 10 ఎకరాల స్థలం కేటాయించమని కాంట్రాక్టు సంస్థలు అడిగాయి. భారీ పరిమాణంలో డయాగ్రిడ్ ఆకృతులను ఇతర ప్రాంతాల్లో ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడకు తీసుకురావాలంటే సమయం వృథా కానుంది. ఇటువంటి సమస్యలేమీ లేకుండా సైట్‌లోనే యూనిట్‌ను ఏర్పాటు చేస్తే రవాణా పరమైన ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు.











