సైబర్ టవర్స్.. హైదరాబాద్ రూపురేఖలను ఏ స్థాయిలో మార్చివేసిందో చెప్పనక్కర్లేదు.ఐటీలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిందంటే దానికి కారణం సైబర్ టవర్స్. దీని వెనుక చంద్రబాబు కృషి ఎంతగానో ఉంది. ఇప్పుడు ఇదే తరహాలో క్వాంటమ్ కంప్యూటింగ్‌కు అమరావతిని రాజధానిగా మార్చే పనిలో పడ్డారు చంద్రబాబు. ఇందులో భాగంగానే క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఐకానిక్‌గా నిర్మించాలని నిర్ణయించారు.
క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ డిజైన్ ప్రపంచంలో ఎక్కడా లేనంత ప్రత్యేకంగా ఉండాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. మరోవారం బిల్డింగ్ నమూనాను ఫైనలైజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 156 క్యూబిట్‌ల క్వాంటమ్ టూ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు IBM సంస్థ ప్రభుత్వానికి ఇప్పటికే DPR అందించింది. ప్రపంచంలో ఉన్న ప్రముఖ సంస్థలను అమరావతి క్వాంటమ్ వ్యాలీకి తీసుకువచ్చేందుకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కంపెనీలు, స్టార్టప్‌లు..పరిశోధనలు నిర్వహించే సంస్థలు, క్వాంటం హార్డ్‌వేర్ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం భూములు కేటాయించనుంది.
క్వాంటమ్ వ్యాలీలో కంప్యూటర్ పరిశోధన..అభివృద్ధి కేంద్రాన్ని IBM సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 40,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనాన్ని నిర్మిస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్ ఫోటాన్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ దృష్ట్యా ప్రత్యేకమైన భద్రతతో కూడిన వాతావరణం ఉండాలి. ఆ కంప్యూటర్ ఉన్న గదిలోకి వెంట్రుక మందం ఖాళీ నుంచి గాలి వెళ్లినా.. వేవ్స్ తగిలినా ప్రాసెసర్‌పై ప్రభావం పడి వచ్చే ఫలితం మారిపోతుంది. కంప్యూటర్ ఏర్పాటుచేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ..ఐసొలేట్ చేసుకుంటూ వస్తారు. బయటి నుంచి కాంతి, శబ్దాలు చొరబడకుండా ఇన్సులేషన్ ఉంటుంది. ఇలాంటి కొన్ని లేయర్ల నిర్మాణాల తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ ఉండే ప్రాంతం ఉంటుంది. అందులో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు.
కంప్యూటర్‌లో వినియోగించే ప్రతి చిన్న విడి భాగానికి ఒక శాస్త్రవేత్త ఉంటారు. క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ సెన్సింగ్ వంటి వివిధ సాంకేతికతల మేళవింపుతో క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతుంది. ఇక్కడి నుంచే క్లౌడ్ ద్వారా ప్రపంచం మొత్తానికి క్వాంటమ్ సేవలను సంస్థ అందిస్తుంది. IBM తయారు చేసే క్వాంటమ్ కంప్యూటర్‌లో వినియోగించే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ డిజైన్ల తయారీ అనుబంధ యూనిట్లకు కూడా స్పేస్‌ను కేటాయించనున్నారు.
మొత్తం వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని టార్గెట్‌గా పెట్టుకుంది కూటమి సర్కార్. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ మాదిరే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డెవలపర్లు భవనాలను నిర్మించి..వివిధ కంపెనీలకు స్పేస్ లీజుకు ఇస్తారు. దీనికి ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం భూములను ఇస్తుంది. అందులో నిర్మించే భవనాల ఆకృతులను మాత్రం ప్రభుత్వం ఎంపిక చేసిన రీతిలోనే ఉండాలనే నిబంధన విధించనుంది. అలా ప్రపంచంలోనే ప్రత్యేకంగా క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక ఉద్యోగికి సగటున 150 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. అలా ప్రభుత్వం నిర్దేశించిన విస్తీర్ణంలో సుమారు 60 వేలమంది నిపుణులు పనిచేసేలా మౌలిక సదుపాయాలను ఇక్కడ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.











