వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు ఒంటిమిట్ట ZPTC ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ నేతలు తల ఎత్తుకోలేకపోతున్నారు. క్యాడర్‌కు సమాధానం చెప్పుకోలేక ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. ఈ ఓటమి అవమాన భారం నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్‌కు ముందు నుంచే రిగ్గింగ్, దొంగ ఓట్లు, అధికార దుర్వినియోగం అంటూ విమర్శలు గుప్పించారు. ఐనప్పటికీ ప్రజలు అవేమి పట్టించుకోలేదు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు చోట్ల టీడీపీ అభ్యర్థికి పట్టం కట్టారు.
ఐతే, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఈ ZPTC ఎన్నికల ఫలితాలు కోయ ప్రవీణ్ IPSకు అంకితం అనే క్యాప్షన్‌తో అంబటి వీడియోను పోస్ట్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో దొంగ ఓట్లు వేస్తున్నట్లు చూపించే ప్రయత్నం చేశారు. పోలింగ్ కేంద్రంలో ఒక వ్యక్తి బ్యాలట్ పత్రాల పుస్తకంలో ఓటు ముద్ర వేసి, వాటిని చించి బ్యాలట్ బాక్స్‌లో వేస్తున్నట్లుగా వీడియోలో ఉంది.
ఐతే ఆ వీడియోలో ఉన్న బ్యాలెట్ పత్రాలు పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ పత్రాలు సరిపోలడం లేదు. వీడియోలోని బ్యాలట్ పత్రాలు మరో రంగులో ఉన్నాయి. దీంతో మరో రాష్ట్రంలో జరిగిన వీడియోను ఏపీలో జరిగినట్లు చూపించే ప్రయత్నం చేసినట్లు రుజువైంది. దీంతో మరోసారు అంబటి నవ్వులపాలయ్యారంటూ సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్ట్ చెక్ సైతం అంబటి పోస్టు చేసింది ఫేక్ వీడియో అని నిర్ధారించింది. వీడియోలోని మాటలను బట్టి చూస్తే అది 2023లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిందని నిర్ధారించింది. ఇక, అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. అంబటిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.











