కొత్త కుర్రాళ్లను ఆనంద్ మహీంద్ర ఆశ్చర్య పరిచారు. వాళ్లలో జోష్ నింపేందుకు అదిరిపోయే బహుమతులు ప్రకటించారు. ఆస్ట్రేలియాపై గుర్తుండిపోయే విజయాన్ని కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించిన యువ ఆటగాళ్లకు ఖరీదైన కార్లు ఇవ్వనున్నట్టు ట్వీట్ చేశారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకే ఈ బహుమతులు ప్రకటించినట్టు పేర్కొన్నారు.
ఆరుగురిపై ప్రశంసల వర్షం…
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఆరుగురు టీమ్‌ఇండియా ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తారు. ఖరీదైన బహుమతులతో ఆశ్చర్యపర్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం చేసి అత్యుత్తమ ప్రదర్శన చేసిన శార్దూల్ ఠాకుర్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్‌గిల్, నవ్‌దీప్ సైని, వాషింగ్టన్ సుందర్, నటరాజన్ లకు THAR SUV కార్లు బహుమతులుగా ఇస్తున్నట్టు ప్రకటించారు. వీరు ఆరుగురూ అసాధ్యాలను సుసాధ్యం చేశారని కీర్తించారు. భావి భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసలతో ముంచెత్తారు. యువతలో స్ఫూర్తిని నింపేందుకే యువ ఆటగాళ్లను బహుమతులతో ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు.
కుర్రాళ్ల పాత్రెంతో కీలకం…
బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో ఈ యువ ఆటగాళ్ల ప్రతిభ అనన్య సామాన్యం. ప్రతిఒక్కరూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సఫలీకృతమయ్యారు. వరుస గాయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాకు జీవం పోశారు. ఆసీస్ గడ్డపై మరో పరాభవం తప్పదని అందరూ భావించిన వేళ.. సరికొత్త చరిత్రను లిఖించారు. సిరాజ్.. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఆసీస్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. నటరాజన్ అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. చివరి టెస్టులో వాషింగ్టన్ సుందర్(62), శార్దూల్ ఠాకుర్(66) అర్ధశతకాలతో అందరి మనసులనూ దోచేశారు. శుభ్‌మన్ గిల్ అర్ధశతకాలతో గుర్తుండిపోయే ఆట ఆడాడు. నవ్‌దీప్ తనదైన శైలిలో బంతులు విసురుతూ.. ఆసీస్ ను కట్టడి చేశాడు. వీళ్లందరి కృషితోనే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ.. భారత్ ను వరించింది.
ఆనంద్ మహీంద్ర నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించేలా తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు ముంచెత్తుతున్నాయి. మహీంద్ర నిర్ణయం.. ఎంతోమందికి స్పూర్థిదాయకమని నెట్టింట ట్వీట్ల వర్షం కురుస్తోంది.