(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
మీరు ఆప్షన్ మార్చుకోండి అంటూ వాలంటీర్లు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులచే లబ్ధిదారులను బలవంతం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సర్కారు చెప్పుకుంటున్న విజయనగరం మండలం గుంకలాం లే అవుట్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి .. బహిరంగ సభలో “ఆప్షన్ 3 మీరు ఎంచుకుంటే .. మేమే నాణ్యమైన ఇళ్లను .. 18నెలల్లో కట్టిస్తామని .. లబ్దిదారులు హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు.. ఇప్పుడేమో సంబంధిత వాలంటీర్లు ద్వారా ఆయా లబ్ధిదారులకు ఫోన్ చేయించి.. ఆప్షన్ 3 లేదు .. 1 గాని 2 గాని సెలెక్ట్ చేసుకోండి .. అంటూ బలవంతం చేస్తున్నారు. అందుకు లబ్ధిదారుల నిరాకరిస్తుండటంతో.. సర్కారు మరో ముందడుగు వేసింది. విజయనగరంలో గృహ లబ్ధిదారులు అందరితో ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి సన్నద్ధమైంది. ఆ సందర్భంగా లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి ఆప్షన్ మార్పించేందుకు .. లేదంటే మీ ఇళ్ల మంజూరు రద్దు అవుతుందని బెదిరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
కలల సౌధం.. సర్కారు ఆర్భాటం
సొంతిల్లు.. ప్రతీ ఒక్కరి కలల సౌధం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గృహం కట్టుకోవడమంటే మామూలు విషయం కాదు. పెరుగుతున్న నిర్మాణ వ్యయం.. కూలీల కొరత ఇదంతా పెద్ద పని. అందుకే గృహ నిర్మాణ పథకంలో పట్టాలు పొందిన లబ్ధిదారులు ఆప్షన్ 3కే మొగ్గు చూపుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైఎస్సార్ అర్బన్ బీఎల్‌సీ పథకం కింద అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తున్నారు. పట్టణాల్లో 54 గజాలు, పల్లెల్లో 72 గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇస్తోంది. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు యూనిట్ విలువగా నిర్ణయించారు. విజయనగరం జిల్లాలో 98,286 మందికి ఇళ్లు మంజూరు కాగా 90,286 మందితో తుది జాబితా ఖరారు చేశారు. వీరు ఆప్షన్లు ఇవ్వడానికి సంశయిస్తున్నారు. ఇప్పటి వరకు 22,566 మంది మాత్రమే ఐచ్ఛికాలు ఇచ్చారు. 21,241 మంది సొంత స్థలాలున్న వారికి గృహాలు మంజూరు చేశారు. వీరంతా వారే నిర్మించుకోవడానికి ముందుకొచ్చారు. వీరిలో 201 మంది ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించారు. వీరికి ప్రభుత్వమే బిల్లులు చెల్లించనుంది.
మార్చేందుకు ప్రత్యేక మేళా
ఇల్లు మంజూరైన లబ్ధిదారులు లే-అవుట్‌ల్లో 47,159 మంది, పొజిషన్ సర్టిఫికెట్లు 13,003, సొంత స్థలం ఉన్న వారు 21,241 మంది ఉన్నారు. రెండో ఐచ్ఛికాన్ని ఇచ్చిన వారు ఇంటి నిర్మాణం మొదలుపెట్టేలా గృహ నిర్మాణ శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరిలో లబ్ధిదారు నిర్మాణం చేపడితే నిర్దేశించిన ప్రకారం యూనిట్ విలువను వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. మూడో ఐచ్ఛికం వారికి అవగాహన కల్పించి రెండుకు మార్చడానికి ఈ నెల 23న విజయనగరంలో మేళా నిర్వహిస్తున్నారు. మరో వైపు జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ నేటికీ కొనసాగుతోంది. మంజూరైన 98,286 ఇళ్లలో ఈ నెల 20తేదీ నాటికి 81,403 మందికి పట్టాలు పంపిణీ చేశారు. గడువు బుధవారంతో పూర్తయినా ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చినట్లు గృహ నిర్మాణ శాఖ పీడీ ఎస్.రమణమూర్తి తెలిపారు.
ఆప్షన్ 1: లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణ సామగ్రిని గృహ నిర్మాణ సంస్థ సరఫరా చేస్తుంది. ఇంటిని లబ్ధిదారులే నిర్మించుకోవాలి.
ఆప్షన్ 2: లబ్ధిదారే సొంతంగా ఇల్లు కట్టుకుంటే బిల్లు (నిర్దేశిత యూనిట్ విలువను) ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఆప్షన్ 3: మేం ఇల్లు కట్టుకోలేం. మీరే నిర్మించి ఇవ్వండని లబ్ధిదారు కోరితే ప్రభుత్వం కట్టిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఆప్షన్ 3కే ప్రాధాన్యత ఇవ్వడంతో సర్కారు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. 1.80లక్షలతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెగేసి చెప్పడంతో .. సర్కారు “ఆంత్య నిష్టూరం కంటే .. ఆది నిష్టూరమే మంచిదనుకున్నట్టుంది” అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.