సుభాష్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని కోల్‌కతా మెమోరియల్ హాల్‌లో జరిగిన సమావేశానికి ప్రధాని మోదీ, బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్‌దన్‌కర్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేదిక పంచుకున్నారు. ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే వేదికను పంచుకోవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఎందుకంటే వారిద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గున మండుతుంది.
అయితే బెంగాల్లో నేతాజీ 125వ జయంత్యుత్సవాలను ఇరు పార్టీలు రాజకీయ వేదికగా మార్చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడే సమయంలో సభకు హాజరైన మోడీ భక్తులు జైశ్రీరామ్ అంటూ పెద్దగా నినాదాలు చేయడంతో వివాదం రాజుకుంది. మమతా బెనర్జీ- తనను అవమానించారంటూ… జైహింద్…జైబంగ్లా అంటూ ఉపన్యాసం మూడు ముక్కల్లో ముగించడంతో రాజకీయ హీటెక్కింది.
బెంగాల్లో పాగా కోసం బీజేపీ ఎత్తులు
దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని బీజేపీ ఖాతాలో వేసుకుంటోన్న ఆ పార్టీ పెద్దలు ఈ సారి ఏప్రిల్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఎప్పటి నుంచో వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందుకు నేతాజీ 125వ జయంత్యుత్సవాలను మోడీ వేదికగా వాడుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి 23 నేతాజీ పుట్టిన రోజును పరాక్రమ్ దివస్ గా ప్రకటించారు. ఇన్నాళ్లూ గుర్తుకు రాని నేతాజీ, బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు గుర్తుకు రావడం కాకతాళీయమేం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే రవీంధ్రనాథ్ ఠాగూర్ తరహాలో గడ్డం పెంచి బెంగాలీలను ఆకర్షించే ప్రయత్నిం చేస్తున్న ప్రధాని మోడీ, కొత్తగా నేతాజీని కొనియాడారు. నేతాజీ స్పూర్తితోనే భారత్ ఈరోజు ముందుకు వెళుతోందని మోడీ గుర్తు చేశారు. ఇలా నేతాజీ జయంతిని రాజకీయ వేదికగా మార్చారనే విమర్శలు వస్తున్నాయి.
Must Read ;- ప్రశాంత్ కిషోర్ VS బీజేపీ.. ఇక డైరెక్ట్ వార్
మమత ఒంటరి పోరాటం
బెంగాల్లో బీజేపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలను అమలు చేసేందుకు సీఎం మమతా బెనర్జీ, పీకేలాంటి వ్యక్తులను రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. అయినా అక్కడ బీజేపీ దూకుడుకు కళ్లెంవేయలేకపోతున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ను మూడో సారి అధికారంలోకి తీసుకురావడం కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఏడేళ్లుగా బెంగాల్ కు కేంద్రం పెద్దగా చేసిందేమీ లేదు. ప్రధాని మోడీకి, మమతా బెనర్జీకి ఒక రకంగా మాటలు లేవనే చెప్పాలి. దీని ప్రభావం బెంగాల్ ఎన్నికల్లో స్పష్టంగా వెల్లడికానుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తరిమికొట్టేందుకు మమతా బెనర్జీ కేంద్రంతో వైరం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో అధికారంలోకి రాకుండా చూడాలనే లక్ష్యంతో ఆమె పావులు కదుపుతున్నారు. ముస్లిం ఓటు బ్యాంకు, వలసదారులపై ఎక్కవగా ఆధారపడ్డ తృణమూల్ కాంగ్రెస్ ఈ సారి గెలుపు జెండా ఎగురవేస్తుందా లేదా అనేది చెప్పడం రాజకీయ పండితులకు సైతం కష్టంగా మారింది.
హిందువుల ఓట్లపైనే ఆధారం
బెంగాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేదు. అయితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోపాటు, వామపక్షాలు నిర్వీర్యం కావడం బీజేపీకి కలసి వచ్చిన అంశం. దీనికితోడు పది సంవత్సరాలుగా బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ పాలిస్తున్నారు. ఎంతో కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉండటం సహజం. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలచుకోవడంతోపాటు, హిందూ, ముస్లింల మధ్య సష్టమైన విభజన రేఖ గీయడం ద్వారా అక్కడ కూడా రామబాణం వదలాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రతి నెలా కోల్ కతాలో ఎవరో ఒక కేంద్ర మంత్రి పర్యటించడం, తృణమూల్ కాంగ్రెస్ ను రెచ్చగొట్టడం ద్వారా మతపరమైన ఓట్ల విభజన చేయాలని బీజేపీ పెద్దలు చేయని ప్రయత్నం లేదు. అయితే బెంగాల్ ప్రజలు బీజేపీని ఆహ్వానిస్తారా? లేదంటే స్థానిక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు పట్టకడతారా? అనేది తేలాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.
Also Read ;- పశ్చిమ బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థి.. స్వామీజీనేనా?