నిన్న సాయంత్రం డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ తన తదుపరి చిత్రం ‘శాకుంతలం’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదిరిపోయే రీతిలో ఒక మోషన్ పోస్టర్ ను డిజైన్ చేయించి గుణ .. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని రివీల్ చేశారు. మహాభారతం.. ఆదిపర్వంలోని ఆ రమణీయ ప్రేమ గాథను గుణశేఖర్ అతి భారీగా సెల్యులాయిడ్ పై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతుండడం అభినందించదగ్గ విషయమే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో శకుంతలగా అనుష్క నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ముందుగా ఈ పాత్రకు పూజా హెగ్డే అనుకున్నారట. కానీ ఆమె కన్నా అనుష్క బెటర్ అనే అభిప్రాయానికి వచ్చాడట గుణశేఖర్.
విశ్వామిత్రుడికి, మేనకలకు జన్మించిన ఆడశిశువు ను శాకుంతలం పక్షులు పెంచుతాయి. ఆ స్థితిలో ఉన్న ఆమెను కణ్వమహర్షి కరుణతో చేరదీసి తన శాకుంతలాల వల్ల పెరిగింది కాబట్టి.. ఆమెకు శకుంతల అనే పేరు పెట్టి సొంత కూతురిలా పెంచుతాడు. కొన్నాళ్లకు కణ్వమహర్షి ఆశ్రమం ప్రాంతాల్లోని అడవుల్లో కి దుష్యంతుడు వేటకు రావడం.. ఆపై కణ్వమహర్షి ఆశ్రమంలోని శకుంతుల తో ప్రేమలో పడడం .. ఆమెను వరించడం.. ఆపై విడిపోవడం.. శాకుంతలం ప్రధాన ఇతివృత్తం. నిజానికి ఈ ఘట్టంతోనే గతంలో యన్టీఆర్, బి.సరోజ దేవి జంటగా ‘శకుంతల’ అనే సినిమా వచ్చింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. దుష్యంతుడుగా యన్టీఆర్ , శకుంతలగా బి.సరోజాదేవి జోడీ ఈ సినిమాకే హైలైట్ గా నిలిచిపోయింది.
ఇప్పుడు శకుంతల పాత్రను అనుష్క చేయబోతుండడం ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణ కానుంది. ఆల్రెడీ అనుష్క గుణశేఖర్ ’రుద్రమదేవి’లో టైటిల్ రోల్ పోషించి.. మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ‘శాకుంతలం’ లో కూడా ఆమె టైటిల్ రోల్ పోషించబోతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియాలో కేటగిరిలో ఈ సినిమాను నిర్మించేందుకు గుణ శేఖర్ రెడీ అవుతున్నాడు. ఇక ఇందులో దుష్యుంతుడుగా దగ్గుబాటి రానా అయితే సినిమాకే మంచి వెయిట్ వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. మరి నిజంగానే అనుష్క శకుంతలగా నటిస్తుందో లేదో చూడాలి.











