వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. గత టీడీపీ పాలనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును దుబారా చేశారంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు జవాబుగా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వమే డబ్బును దుబారా చేస్తోందని ఆయన ప్రతి విమర్శలు చేశారు.
ఎమ్మెల్సీ ఆరోపణలు
43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి,16 నెలలు చిప్పకూడు తిన్న వైఎస్ జగన్ ని విజన్ ఉన్న నాయకుడు అంటారా విజయ సాయిరెడ్డి? అంటూ వెంకన్న ఎద్దేవా చేశారు. పోలవరం యాత్రకు ధనం వృథా చేసి ఉంటే వైసీపీ సైకో బ్యాచ్ ఊరుకుంటుందా? అంటూ ప్రశ్నించారు. పోలవరం అనేది 7 దశాబ్దాల రాష్ట్ర ప్రజల కల..70 శాతం చంద్రబాబు నాయుడు పూర్తి చేశారు కాబట్టి కల సాకారం అవుతున్న దృశ్యాన్ని ప్రజలకు చూపించారని వెల్లడించారు. వైసీపీ నాయకులు లాగా ఢిల్లీ వాళ్లకు ‘ఫుట్ మసాజ్’ చేయకుండా, రాష్ట్ర సమస్యలపై చంద్రబాబు కేంద్రంతో పోరాడారని పేర్కొన్నారు.
స్కూల్ పిల్లలు వేసుకునే బెల్ట్ కి, సాక్స్ కి వైసీపీ రంగులు వేసుకునే తమరు దుబారా గురించి మాట్లాడుతున్నారా? అంటూ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. అన్నట్టు 4 వేల కోట్ల రూపాయలతో పంచాయతీలకు వైకాపా రంగుల దుబారాని గుర్తు చేసుకోవాలని మండిపడ్డారు.
‘తాడేపల్లి ఇంటి కోసం రూ.16 కోట్లు, నాయన సమాధి కోసం రూ.27 కోట్లు, చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులకు 60 కోట్లు, సీబీఐ కోర్టుకు వెళ్లడానికి ప్రతి వారం 60 లక్షల రూపాయలు, మీ కక్షలు తీర్చుకోవటానికి లాయర్ల ఫీజులంటూ వందల కోట్ల రూపాయలు, మీ అవినీతి పత్రికకు వందల కోట్ల రూపాయలు, మీరు చేసే వేల కోట్ల రూపాయల దందాలు, మొత్తం లెక్క తీస్తే, 10 పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చు’ అని బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.
యూ టర్న్ లు ఏంటీ మహాప్రభో
అక్టోబర్ 5న ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో జగన్ ప్రధాని మోడీని కలిశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ గత ఎన్నికలలో ప్రచారం చేసిన వైసీపీ అధికారం లోకి రాగానే ఆ హామీని విస్మరించారని విమర్శలు వస్తున్నాయి. బీజేపీకి మెజారిటీ దక్కిందని హోదాపై పోరాటం చేసినా పెద్ద ప్రయోజనం లేదని జగన్ తొలినాళ్ళలోనే ప్రకటించారు. తాజాగా విజయవాడ పర్యటనకు వచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వైసీపీ ప్రభుత్వం అడిగేది 14వ ఆర్థిక సంఘం సిఫారసులవి ఆ గడువు ముగిసిపోయింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని ప్రకటించారు. రెండిటికి చెడ్డ రేవాడిలాగా జగన్ ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఆర్థిక ఇబ్బందులలో ఉన్న రాష్ట్రానికి కేంద్రం చేయూత ఎంతయినా అవసరం. కానీ జగన్ నిర్ణయాల జాప్యంతో ఏపీ ఆర్డిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో బుద్ధా వెంకన్న మరోమారు వారు ట్వీట్లతో విరుచుకుపడ్డారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల ముందు తొడలు చరిచి, ఇప్పుడు కేసుల కోసం మెడలు దించుకొని కాళ్ళు నాకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ కు హోదా తలుచుకొంటే చంచలగూడా జైలు గుర్తుకు వచ్చి తడిసిపోతోందని ఎద్దేవా చేశారు. ఈ యూ టర్న్ లు చూసి ఊసరవెల్లులు ఆత్మహత్య చేసుకొంటున్నాయని వెల్లడించారు. ప్రజలు మిమ్మల్ని పాతాళం కంటే లోపల పాతేయడానికి సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.











