తెలుగు రాష్ట్రాల్లో అన్నా చెల్లెళ్లంటే ఏపీలో వైఎస్ జగన్ – వైఎస్ షర్మిల, తెలంగాణలో అయితే కేటీఆర్ – కవిత మాత్రమే గుర్తుకు వస్తారు. రక్షా బంధన్ వచ్చిందంటే.. మీడియా చూపంతా వీరిమీదే ఉంటుంది. ఇంకా సెలబ్రిటీల్లో ఉన్న అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు కడా హైలైట్ అవుతుంటారు. ఇక ఈ రక్షా బంధన్ కు తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత తన అన్నకు రాఖీ కట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి తీహర్ జైలులో ఉన్నారు. ఒకవేళ బయట ఉంటే వారి రక్షా బంధన్ చూడముచ్చటగా ఉండేది.
ఇక ఏపీలో మాత్రం వైఎస్ జగన్ – వైఎస్ షర్మిల గత మూడేళ్లుగా రక్షా బంధన్ కు దూరంగానే ఉంటున్నారు. తన అన్నతో వ్యక్తిగత మనస్ఫర్థల కారణంగా.. వైఎస్ షర్మిల ఆయన నుంచి దూరం జరిగి తన రాజకీయ భవిష్యత్తును తాను చూసుకుంటున్నారు. దీంతో సొంత చెల్లెలికి అపకారం చేసిన అన్నగా జగన్ చరిత్రలో మిగిలిపోయారు. పైగా ఇంకో చెల్లెలు సునీత (చిన్నాన్న కూతురు) కు కూడా జగన్ రెడ్డి అంతకు మించిన అన్యాయం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును గత ఐదేళ్లుగా పట్టించుకోకుండా.. నిందితులను కాపాడుతూ వచ్చారు. ఆ హత్యను తన రాజకీయ భవిష్యత్తు కోసమే జగన్ రెడ్డి చేయించారనే భావన అందరిలోనూ ఉన్న సంగతి తెలిసిందే.
అందుకు తగ్గట్లుగానే జగన్ రెడ్డి తాను సీఎంగా ఉన్నన్ని రోజులు కేసులో అనుమానితుడిగా ఉన్న తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతూ వచ్చారు. ఇలా సొంత చెల్లెళ్లకే అన్యాయం చేసిన జగన్.. వారితో రాఖీ కట్టించుకునే అదృష్టాన్ని కోల్పోయారు. కనీసం భవిష్యత్తులో అయినా తన చెల్లెళ్లతో జగన్ రాఖీ కట్టించుకుంటారా అంటే.. అది జరిగే పనిలా కనిపించడం లేదు. ఇలాంటి జగన్ రాఖీ పండక్కి శుభాకాంక్షలు తెలపడంతో అందరూ నవ్వుతున్నారు. చెల్లెమ్మలు ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాలని, ఈ ప్రయాణంలో మీకు ఎల్లపుడూ తోడుగా ఉంటానని జగన్ ట్వీట్ చేశారు.
సొంత చెల్లి షర్మిలకు రాజకీయంగా, ఆర్థికంగా న్యాయం చేయని జగన్.. మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు తోడుగా ఉంటానని ఇలా అనడం విపరీతమైన ట్రోలింగ్ కు కారణం అవుతోంది. ఆస్తిలో వాటా ఇవ్వకుండా, రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చి షర్మిలను జగన్ మోసం చేశారు. బాబాయ్ వివేకా హత్య కేసులో మరో చెల్లి సునీతకు అండగా ఉంటానని నిందితుల పక్షం వహించారు. రాజకీయంగా, ఆర్థికంగా, న్యాయ పరంగా సొంత చెల్లెళ్లను ఆదుకోలేని జగన్.. ఇంక రాష్ట్రంలోని మహిళలకు అండగా ఉంటారా అని ప్రశ్నలు వస్తున్నాయి.