రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును తానే అడ్డుకున్నానని, తన పోరాటం వల్లే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని, తనపై గౌరవంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేశారంటూ తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి.
ఐతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు గత వైసీపీ ప్రభుత్వం, అప్పటి సీఎం జగన్ హయాంలోనే నిలిచిపోయాయని స్పష్టం చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండానే జగన్ సర్కార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టిందని గుర్తు చేసింది. అంతేకాదు, రోజుకు 3 TMCల నీటి తరలింపు అంటూ జగన్ చేసిన ప్రకటనలతో అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న BRS సర్కార్ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కోర్టులు, NGT సహా పలు స్థాయిల్లో కేసులు వేసిందని, దీంతో అనుమతులు లేని కారణంగా NGT, కేంద్ర ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయాలని ఆదేశాలిచ్చిందని కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
చంద్రబాబు సెంట్రిక్‌గా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందేందుకు ఆ రాష్ట్రంలోని అధికార, విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వం విమర్శించింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం రాజీ ఉండబోదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనుల నిలిపివేతపై ఆధారాలతో సహా వాస్తవాలు బయటపెడతామని ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి పూర్తి అనుమతులు సాధించి, పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేసింది. గతంలో పనులు నిలిచిపోవడానికి కారణం వైసీపీ అసమర్థతే అని మండిపడింది. మొత్తంగా KCR హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిచిపోయాయని కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లయింది.
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు కూడా రోజుకు 3 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు తరలించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.సాధారణంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 885 అడుగులకు చేరితేనే నీటిని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఐతే ఈ లిఫ్ట్ పూర్తయితే 800 అడుగుల దగ్గరి నుంచి నీటిని తోడుకునే వీలు ఉంటుంది. ఐతే దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించడంతో అప్పట్లోనే పనులు ఆగిపోయాయి.











