ఏపీలో ప్రపంచ వింత చోటుచేసుకుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన లక్షలాది టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలంటూ వామపక్షాలు, ప్రతిపక్ష టీడీపీ ఉద్యమాలు చేయడంతో ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. ఏదిముద్దు పేరుతో భారీ ప్రకటనలు విడుదల చేశారు. ఈ ప్రకటనల సారాంశం పరిశీలిస్తే ఆశ్చర్యం వేయకమానదు. టీడీపీ ప్రభుత్వం పేదలకు నిర్మించిన గృహాలు తీసుకుంటే వారు రుణబకాయిలు, వడ్డీలతో కలసి రూ.7.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, అదే వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయికి రూ.7.5 లక్షల విలువైన ఇంటిని నిర్మించి ఇస్తుందని ఏదిముద్దు ప్రకటన సారాంశం. అంటే టిడ్కో ఇళ్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
టిడ్కో ఇళ్లు పంపిణీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదా?
టీడీపీ ప్రభుత్వం నిర్మించిన గృహాలను పేదలకు ఇస్తే వారు ఆ పార్టీపై అభిమానం చూసే అవకాశం ఉందని వైసీపీ అధినేత భావించడమే ఇందుకు కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకుండా చేస్తే అసలు సమస్యే ఉండదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, పేదలు ఎవరూ టిడ్కో ఇళ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు. మరికొద్ది రోజుల్లో ఇలాంటి ప్రకటనలు కూడా మనం చూడబోతున్నామని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వేల కోట్లు బూడిదలో పోసినట్టేనా…
ఏపీలో 4 లక్షల టిడ్కో గృహాలు పూర్తి చేశారు. మరో 6 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, టిడ్కో ద్వారా బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున రుణాల రూపంలో వేల కోట్లు ఖర్చు చేశారు. లబ్దిదారులు కూడా ఒక్కొక్కరు రూ.40 వేలు డీడీలు తీశారు. ఇలా దాదాపు పది లక్షల మంది పేదలు రూ.40 వేలు చెల్లించి మూడేళ్లు దాటిపోయింది. అయినా వారికి ఇంటిని కేటాయించలేదు. కనీసం నిర్మాణం పూర్తయిన గృహాలను కూడా పేదలకు ఇవ్వకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. రాజకీయలబ్దికోసం వేల కోట్లు ప్రజాధనం వృధా చేయడంపై మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వామపక్షాలు పెద్దఎత్తున ఉద్యమం చేపట్టాయి. అయితే టిడ్కో గృహాల వద్ద 144 సెక్షన్ పెట్టి వైసీపీ ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసే ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు వస్తుననాయి. తాజాగా ఏదిముద్దు పేరుతో విడుదల చేసిన ప్రకటన మరింత వివాదాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం లేకపోలేదు.
వైఎస్సార్ కాలనీలను ఓటు బ్యాంకులుగా మార్చే ప్రయత్నం
వైసీపీ ప్రభుత్వం క్రిస్మస్ రోజు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు, అదే రోజు 15 లక్షల గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. పేదలకు రూపాయికే ఇంటిని నిర్మించి ఇస్తామని ‘ఏదిముద్దు’లో వివరంగా చెప్పారు. వైఎస్సార్ ఇళ్లు వస్తుంటే, టిడ్కో ఇళ్లు ఎందుకు అన్న చందంగా ప్రకటనలు గుప్పించారు. ఇక పేదలు కూడా రూపాయికే ఇళ్లు వస్తుంటే కాదంటారా. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల వైఎస్సార్ కాలనీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల నాటికి ఆ కాలనీల్లో టీడీపీ వారిని అడుగుపెట్టనీయకుండా చేయాలని వైసీపీ అధినేత ఆలోచనగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కుదిరితే వైఎస్సార్ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలు నిర్మించి, వచ్చే ఎన్నికల నాటికి అక్కడే పోలింగ్ బూతులు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే వైఎస్సార్ కాలనీలను వైసీపీ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలకు బీజం వేసినట్టేనని అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు మాత్రం తలపండిన మేధావులకు సైతం అర్థంకాకుండా తయారయ్యాయనడంలో అతిశయోక్తి లేదు.











