ఈ తరం కుర్రాళ్లను అందానికి నిర్వచనం అడిగితే రాశి ఖన్నా పేరు చెబుతారు. అందానికి నిదర్శనం ఏమిటని అడిగితే రాశి ఖన్నా పోస్టర్ ను చూపుతారు. అంతగా వాళ్ల దృష్టిలో అందానికి కేరాఫ్ అడ్రెస్ గా రాశి ఖన్నా నిలిచిపోయింది. తెల్లని మేనిఛాయతో మెరిసిపోయే ఈ అమ్మాయి, వెన్నెల వేళలో వెన్న ముద్దలతో తయారుచేసినట్టుగా కనిపిస్తుంది. నందివర్ధనాలన్నీ ఒకేసారిగా విరిసినట్టుండే ఆమె నవ్వు మంత్రముగ్ధులను చేస్తుంది. తెరపై పూతరేకులా కనిపించే ఈ అమ్మాయికి యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. తన గ్లామర్ పై తనకి గల నమ్మకంతోనే ఈ సుందరి ఒక్కో సినిమాను తాపీగా చేసుకుంటూ వెళుతోంది. అలాంటి పుత్తడిబొమ్మ పుట్టినరోజు ఈ రోజు.
అందంగా ఉన్నవాళ్లంతా తెరపై కథానాయికలుగా కనిపించవచ్చు. కానీ అభినయం తెలిసిన వాళ్లు మాత్రమే కథానాయికలుగా నిలబడతారు. అలా అందమైన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కథానాయికగా రాశి ఖన్నా కనిపిస్తుంది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో యూత్ దృష్టిలో పడిన ఈ అమ్మాయి, ‘జిల్’ సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. రవితేజ సరసన నాయికగా రాశి ఖన్నా చేసిన ‘బెంగాల్ టైగర్’ .. గ్లామర్ పరంగా ఆమెకి మరిన్ని మార్కులను తెచ్చిపెట్టింది. ఆ తరువాత చేసిన ‘సుప్రీమ్’ సినిమా, నటన పరంగాను ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆమె పోషించిన ‘బెల్లం శ్రీదేవి’ పాత్ర జనంలోకి బాగా వెళ్లింది. రాశి ఖన్నా కామెడీ కూడా చేయగలదనిపించుకుంది.
రాశి ఖన్నాకి అదృష్టం కలిసొచ్చి ఎన్టీఆర్ జోడీగా ఆమె చేసిన ‘జై లవకుశ’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో ఆమె ‘ప్రియ’ పాత్రలో ఆకట్టుకుంది. ఆ సినిమాలో ‘ట్రింగు ట్రింగు ట్రింగు మంది గుండెలోన .. ‘ పాటలో ఆమె అజంతా శిల్పంలా మెరిసింది. ఈ సినిమా తరువాత రాశి ఖన్నా కి వరుసగా మూడు పరాజయాలు ఎదురైనా ఆమె డీలాపడలేదు. ఎందుకంటే ఈ లోగానే వరుణ్ తేజ్ తో చేసిన ‘తొలిప్రేమ’ ఆమెకి భారీ విజయాన్ని ముట్టజెప్పింది. ఈ సినిమాలో ‘వర్ష’ పాత్ర కోసం ఆమె కాస్త సన్నబడి నాజూకుగా మారింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కొత్తగా కనిపిస్తూ, గులాబీ రేకులా గుండెతెరను తాకింది.
ఈ సినిమా నుంచి రాశి ఖన్నా తమిళ అవకాశాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం కనిపిస్తుంది. అక్కడ వరుస సినిమాలను అంగీకరిస్తూనే, ఈ రెండేళ్లలో తెలుగులో మూడు సినిమాలు చేసింది. యువ కథానాయకుల జోడిగా ఆమె చేసిన ఈ సినిమాలు, ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో రాశి ఖన్నా లైట్ తీసుకుని కోలీవుడ్లోనే తన జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తమిళ సినిమాలు వున్నాయి. ఈ సినిమాలపై అక్కడ భారీ అంచనాలు వున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె విక్రమ్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.
గతంలో విక్రమ్ హీరోగా దర్శకుడు హరి ‘సామి’ .. ‘సామి 2’ సినిమాలను తెరకెక్కించాడు. విక్రమ్ తో మరో యాక్షన్ మూవీని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ జోడిగా ఆయన రాశి ఖన్నాను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. మొత్తానికి రాశి ఖన్నా వరుస సినిమాలతో వచ్చే ఏడాది కోలీవుడ్ ను షేక్ చేయనుందన్న మాట. తెలుగులో ‘నిదానమే ప్రధానం’ అన్నట్టుగా కనిపించిన రాశి ఖన్నా, తమిళంలో మాత్రం ‘ఆలస్యం అమృతం విషం’ అన్నట్టుగా స్పీడ్ చూపిస్తుండటం విశేషం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాశి ఖన్నాకి ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.