ఏపీ ప్రభుత్వం మరో షాకింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. కుక్కలను పెంచుకునే వారు, పందుల పెంపకం దారులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల క్రితం కుక్కలను పెంచుకోవాలంటే లైసెన్సు, సైకిల్ కి లైసెన్సుల్లాంటివి ఉండేవి.. ఇప్పుడు అదే తరహాలో కుక్కలను పెంచుకోవాలని లైసెన్సు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఇక పందుల పెంపకం దార్లకు సంబంధించి ఇప్పటికే పలు నియంత్రణలు ఉండగా, వాటిని అదనంగా కొన్ని నియంత్రణలను జోడిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏపీలో కుక్కలు, పందుల కు సంబంధించి జగన్ ప్రభుత్వం తాజాగా తెచ్చిన 693 జీవో చర్చనీయాంశమైంది. లైసెన్సు లేని కుక్కలు, పందులు కనిపిస్తే.. సదరు జంతువుల యజమానులకు రూ.500 జరిమానాతోపాటు రోజుకు రూ.250 పెనాల్టీ విధించనున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం ఉచితంగా లైసెన్సులను జారీచేస్తారని ప్రభుత్వం పేర్కొంది. వీధి కుక్కలు, ఎవరికీ చెందని పందులు ఉంటే.. వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయనున్నారు.
ఇవీ ఉత్తర్వులు..
పెంపుడు జంతువులకు యజమానులు ఖచ్చితంగా హెల్త్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. కుక్కలకు హెల్త్ సర్టిఫికెట్, పందులకు పశువైద్యుడు జారీచేయాలని ఆదేశించింది. ఈ లెసెన్సు బయటకు కనిపించేలా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటిపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఉండాలని ఆదేశాలిచ్చింది. గ్రామ సర్పంచ్ ఛైర్మన్‌గా, పంచాయతీ సెక్రటరీ కన్వీనర్ గా ఉండడంతోపాటు పీహెచ్ సీ వైద్యుడు, మండల పశుసంవర్ధక శాఖ అధికారి, గ్రామ పశుసంవర్ధక శాఖ సహాయకుడు, జిల్లా SPCA నామినేట్ చేసిన సభ్యులు, జంతు సంరక్షణ సంస్థల నుంచి ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పర్యవేక్షణలో లైసెన్సులు జారీచేయనున్నారు.
వీధికుక్కలు, యజమానులు లేని పందులు, కుక్కలను గుర్తించి వాటిని పట్టుకోవడం, వెటర్నరీ ఆస్పత్రులకు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం, టీకాలు వేయించడం వంటి కార్యక్రమాలను వీరు పర్యవేక్షిస్తారు. తీవ్ర ఆనారోగ్యం, గాయాల పాలైన కుక్కల విషయంలో నిబంధనల మేరకు కారుణ్య మరణం (పెంటతాల్ ఇంజెక్షన్ లాంటి చర్యలు) అమలుచేయాలని, అదీ నిర్దేశించిన వేళల్లో మాత్రమే చేయాలని సూచించింది. పందుల పెంపక కేంద్రాలు గ్రామానికి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండేలా చూడాల్సిందిగా పేర్కొంది.
అమలు ఎలా..
కమిటీల ఏర్పాటు, ఉత్తర్వుల జారీ వరకు బాగానే కనిపిస్తున్నా.. అమలు ఎలా అనేదే అసలైన ప్రశ్న. ఇప్పటికే పురపాలక సంఘాల్లో వీధికుక్కల విషయంలో నిర్లక్ష్య ధోరణులపై ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటిది గ్రామాల్లో ప్రతి చిన్న విషయం సున్నితంగా మారే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ఉత్తర్వుల అమలు ఎంతవరకు సాధ్యం అవుతుందనే చర్చ మొదలైంది. ఒక్క ఏపీలోనే కాదు.. పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే వీధి కుక్కల నియంత్రణ విషయంలో గతంలో చాలా ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. ఈ మార్గదర్శకాలు ఉన్నా.. ఎప్పుడో ఒకసారి తప్ప.. మిగతా సందర్భాల్లో పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటికీ పురపాలక సంఘాల్లో రోజూ వీధి కుక్కల విషయంపై పలు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీచేయడంతోనే పరిమితం కాకుండా.. వివాదాలు, చట్టపరమైన ఇబ్బందులు లేకుండా అమలు చేయడమే ప్రభుత్వానికి అసలైన సవాలుగా మారనుంది.