ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు గుడ్ న్యూస్ వినిపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మరో కీలక సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇంటింటికీ ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మూడు పార్టీలు కలిసి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఓ కార్యక్రమం నిర్వహించాయి. ఇందులో చంద్రబాబు మాట్లాడుతూ.. ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే తమ హామీలకు తగ్గట్లుగా క్రమంగా ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే. తొలుత వృద్ధాప్య పింఛన్లను ఏకంగా రూ.4 వేలకు పెంచింది. అవి లబ్ధిదారులకు అందించేందుకు వాలంటీర్లు అక్కర్లేదని.. అధికార యంత్రాంగంతో నేరుగా ఇంటికే పంపిణీ చేయడం సాధ్యమని చంద్రబాబు నిరూపించారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి ఒకేరోజు రికార్డుస్థాయిలో పింఛన్ల పంపిణీ పూర్తిచేశారు. ప్రతినెలా ఒకటో తేదీ పేదల సేవ పేరుతో పింఛన్ల పంపిణీలో ప్రతి ఒక్కరూ నిమగ్నం అవుతున్నారు.
మరోవైపు, చంద్రబాబు అన్నా క్యాంటిన్లను కూడా ప్రారంభించారు. విడతల వారీగా మరిన్ని క్యాంటిన్లను పెంచుకుంటూ పోతున్నారు. మొదటగా 100 క్యాంటిన్లతో ప్రారంభమై వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. వీటి ద్వారా కేవలం రూ.5 కే కడుపు నిండా భోజనం ప్రజలకు దొరుకుతున్న సంగతి తెలిసిందే. ఇంకా చంద్రబాబు ఇతర సంక్షేమ పథకాలైన చంద్రన్న పెళ్లి కానుక, అంబేడ్కర్ ఓవర్ సీస్ విద్యా నిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి తదితర పథకాలను గతంలో తరహాలోనే అమలు చేస్తున్నారు.
మరోవైపు, చంద్రబాబు ఈ కార్యక్రమంలో ఎన్డీయే ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు కొన్ని విషయాలపై దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని ఈ నెల 20 నుంచి 6 రోజుల పాటు ప్రజలకు వివరించాలని సూచించారు. అంతేకాక, ప్రతిపక్ష పార్టీ చేసే విష ప్రచారాలను తిప్పికొట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలకంగా వ్యవహరించాలని.. అందరి సమన్వయంతో ఈ 100 రోజుల్లోనే వెయ్యి అడుగులు ముందుకెళ్లామని చంద్రబాబు వివరించారు.