వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఉండగా ఆ పార్టీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా తన సొంత పత్రిక ‘సాక్షి’కి దోచిపెట్టుకున్న తీరు గురించి ప్రస్తుత మంత్రివర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచిపెట్టేందుకు, ఆ పత్రికకు ఎనలేని లబ్ధి చేకూర్చేందుకు అనేక తప్పుడు విధానాలను జగన్ అనుసరించారని రాష్ట్ర మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ ప్రైవేటు సైన్యం అయిన వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను కొనిపించేందుకు రెండేళ్లలోనే ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.205 కోట్లు ఖర్చు పెట్టారని మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమే అని అభిప్రాయపడ్డారు. జగన్ తన భార్య భారతి ఛైర్మన్‌గా ఉన్న సాక్షికి ప్రజాధనాన్ని దోచిపెట్టిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించింది.
జగన్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో సాక్షి పేపర్ కి యాడ్స్ రూపంలో కూడా అడ్డగోలుగా దోచి పెట్టారని.. అలా దాదాపు రూ.443 కోట్లు దోచిపెట్టారని గుర్తించారు. ఇతర పత్రికలన్నింటికీ ఇచ్చింది కలిపినా కూడా ఇంత మొత్తం లేదని గుర్తించారు. బుధవారం సెక్రటేరియట్ లో జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై బాగా చర్చ జరిగింది. జగన్ ప్రభుత్వం కొన్ని పత్రికలకు కక్షపూరితంగా ప్రకటనల బకాయిలు కూడా నిలిపివేశారనీ కూడా వీరు గుర్తించారు. వాటిని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అంతేకాక, అసలు సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంత? ఏ ప్రాతిపదికన ఆ న్యూస్ పేపర్ కొనడానికి ప్రభుత్వం వాలంటీర్లకు డబ్బులు ఇచ్చింది? అసలు ఏ రూల్స్ ప్రకారం అన్ని కోట్ల రూపాయల ప్రకటనలు అడ్డగోలుగా జారీ చేసిందనే అంశంపై సమగ్రంగా విచారణ జరిపించాలని నిర్ణయించారు. దీంతో సాక్షి పత్రిక చైర్ పర్సన్ భారతి రెడ్డిలో, ఆమె భర్త జగన్ రెడ్డిలో కంగారు మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాక్షి పత్రిక నష్టాల్లో ఉంది. జగన్ ప్రభుత్వం పడిపోవడంతోనే.. సాక్షి పత్రిక ఆదాయ మార్గాలు కూడా దిగజారిపోయాయి. వాలంటీర్ల వ్యవస్థ పోవడంతో ఆ పత్రిక సర్క్యులేషన్ దాదాపు రెండున్నర లక్షలు తగ్గిపోయింది.
దీంతో భారీ సర్క్యులేషన్ అని డబ్బా కొట్టుకొని పెద్ద పెద్ద యాడ్స్ సంపాదించిన పత్రిక ఆ దెబ్బతో కుదేలయింది. ఒక్కసారిగా యాడ్స్ రెవెన్యూ మొత్తం పడిపోయింది. ఐదేళ్లు దర్జాగా దండుకున్న పత్రిక ఇలా ఒక్కసారిగా నష్టాల్లోకి పోవడంతో.. భారతి దిద్దుబాటు చర్యలకు కూడా దిగింది. సిబ్బందిపై వేటు వేయడం, హైక్స్ లేకపోవడం సహా ఎన్నో కాస్ట్ కటింగ్ లకు పాల్పడుతూ నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్ల అవకతవకలపై విచారణ జరిపించనుండడం భారతికి కొత్త తలనొప్పిని తెచ్చి పెడుతోందని అంటున్నారు.