151 సీట్ల బలం నుంచి 11 సీట్లకే పరిమితం అయిపోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రెక్కలు తెగిపోతున్నాయి. ఆయనకు ఎంతో సన్నిహితంగా మెలిగిన సీనియర్ నేతలు కూడా జగన్ కు బాసటగా నిలవకపోగా ఆయన తీరును తప్పుబట్టి మరీ బయటకు వచ్చేస్తున్నారు. ఇలాంటి షాకులు వరుసపెట్టి జగన్ కు తగులుతుండగా.. భవిష్యత్తులో మరిన్ని ఝలక్ లు తగులుతాయని అంటున్నారు. మొత్తానికి జగన్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన సీనియర్లే తనకు గుడ్ బై చెప్పేస్తుండడంతో జగన్ సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా జగన్ కు సమీప బంధువు, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా బుధవారం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇది జరిగి 24 గంటలు కాకముందే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేసేశారు. ఇదేదారిలో రేపో మాపో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా పార్టీ వీడుతున్నారని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
బాలినేని శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం తాడేపల్లికి వెళ్లి జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఇక తాను పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పి వచ్చేశారు. నిన్ననే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి జనసేనలో చేరేందుకు అన్నీ రెడీ చేసుకున్నారు. ఆ మీటింగ్ తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎన్నో అవమానాలను వైసీపీలో ఎదుర్కొన్నానని, ఇక ఉండలేనని చెప్పారు. జగన్ పని అయిపోయిందని.. ఇక ఆ పార్టీని జనాలు నమ్మే పరిస్థితి ఉండబోదని బాలినేని అన్నారు. మరోవైపు, సామినేని ఉదయభాను కూడా పవన్‌తో సమావేశమై 22న ఆ పార్టీలో చేరతానని ప్రకటించేశా. అయితే, ఇలాంటి కీలక నేతలు చేయి జారిపోకుండా జగన్ బుజ్జగిస్తున్నప్పటికీ వారు వినిపించుకోవడం లేదని అంటున్నారు. వైసీపీలో కొనసాగితే భవిష్యత్ ఉండదన్న ఆలోచనలతోనే వీరంతా తమ దారి తాము చూసుకుంటున్నారని అంటున్నారు.
కొద్ది రోజుల క్రితమే జగన్‌కు ఆత్మీయుడిగా భావించే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీకి, రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేశారు. అంతేకాక, ఆయన వెంట ఉన్న పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. ఇక అటు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు వైసీపీని వదిలి బయటికి చెప్పేశారు. రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుసపెట్టి నేతలంతా దూరం అవుతుండడంతో పాటు.. తిరుమల లడ్డూ వ్యవహారంలో జరిగిన అపచారం వంటివి జగన్ మరింత నైరాశ్యంలో కూరుకుపోయేలా చేస్తున్నట్లుగా చెబుతున్నారు.











