ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. అసలు ఏపీలో రూల్ ఆఫ్ లా అమలవుతోందా? అని హైకోర్టు ప్రశ్నించింది అంటే ఏపీలో పోలీసు శాఖపై హైకోర్టుకు వస్తున్న కేసులే ఇందుకు నిదర్శనం. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతిపక్షంపై, ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేసిన, రాసిన వారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారు. వైసీపీ పెద్దల ఆదేశాలతో పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు. చివరకు బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో పోలీస్ బాస్ కు ముట్టికాయలు తప్పడం లేదు.
చేతకాకపోతే డీజీపీ తప్పుకో
ఏపీ డీజీపీపై హైకోర్టు సోమవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్త ం చేసింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యంపై, బాధితుడి మేనమామ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం వెంకటరాజు విషయంలో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో మూడు సార్లు జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందని హైకోర్టు అభిప్రాయపడింది.
ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని హైకోర్టు మండిపడింది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే రాజీనామా చేయాలని హైకోర్టు డీజీపీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. గతంలో డీజీపీని పలు సార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదన్న హైకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది వస్తుందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
గతంలోనూ అనేక కేసుల్లో హాజరైన డీజీపీపై హైకోర్టు సీరియస్ గా స్పందించినా మార్పు రాలేదు.
పోలీసు డీజీపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో అలాంటి దృష్టాంతాలు అనేకం ఉన్నాయి.
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబు అరెస్టుపై హైకోర్టు సీరియస్
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద టీడీపీ అధినేత, జడ్ క్యాటగిరీ ఉన్న చంద్రబాబునాయుడును సీఆర్పీసీ 151 సెక్షన్ కింద ఎలా అరెస్టు చేస్తారంటూ హైకోర్టు స్వయంగా డీజీపీనే ప్రశ్నించింది. 151 సెక్షన్ కింద చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ హైకోర్టులో చెప్పారు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని డీజీపీ కోర్టుకు విన్నవించారు.
అమరావతి గ్రామాల రైతులను భయబ్రాంతులకు గరిచేస్తారా?
అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 144 సెక్షన్ విధించి, పోలీసులను భారీగా మోహరించడంపై కూడా హైకోర్టు డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రూల్ ఆఫ్ లా ఎలా ఉంటే అలా నడుచుకుంటానని, అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గనని డీజీపీ హైకోర్టులో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అనేక పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
అధికారులు ప్రజల కోసం పనిచేయాలని హైకోర్టు డీజీపీకి సూచించింది. 500 మంది పోలీసులతో రాజధాని గ్రామాల్లో లాంగ్ మార్చి నిర్వహిస్తారా.. మనమేమైనా సరిహద్దుల్లో ఉన్నామా అని హైకోర్టు డీజీపీని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని డీజీపీ హైకోర్టుకు సంజాయిషీ ఇచ్చారు. కానీ తరచుగా పోలీసులు రూల్ ఆఫ్ లా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాజా ఘటనే ఇందుకు నిదర్శనం.
డీజీపీని హెచ్చరించిన జాతీయ మహిళా కమిషన్
అమరావతి రాజధాని రైతుల విషయంలో పోలీసులు మహిళల పట్ల వ్యవహరించిన తీరుపై జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. రాజధానికి భూములిచ్చిన మహిళలను పోలీసులు బూటుతో తన్నడంపై వచ్చిన కథనాల ఆధారంగా జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ డీజీపీకి కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ డీజీపీని కోరింది. రాజధాని మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఆదేశించించిన విషయం తెలిసిందే.
గౌతమ్, లోచి అరెస్టు వ్యవహారంలోనూ డీజీపీకి అక్షింతలు
సంవత్సరం క్రితం విశాఖ పోలీసులు ఓ కేసు విషయంలో గౌతమ్, లోచి అనే ఇద్దరు దంపతులను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపించారు. దీంతో తన కొడుకు, కోడలిని పోలీసులు ఏదైనా చేస్తారనే భయంతో గౌతమ్ తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ కేసులోనూ హైకోర్టు డీజీపీపై సీరియస్ అయింది.
ఏపీ పోలీసుల్లో మార్పురాదా?
ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఎన్ని సార్లు సీరియస్ అయినా వారు మారరా? స్వయంగా డీజీపికి అక్షింతలు వేసినా, వారి తీరు మార్చుకోవడం లేదు. పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. అధికారులు ప్రజలకు అండగా నిలవాలని కోర్టులు సూచించినా పోలీసుల తీరు మారకపోవడంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది.