ఏకంగా నేతల గల్లా పట్టుకునే పరిస్థితి ఎదురైంది అంటేనే ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతుంది. చాలా మంది నేతలు వరద ప్రాంతాల్లో పర్యటనలు అంటేనే జంకుతున్నారు. ఇక సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నేతలను ప్రజలు తిడుతున్న వీడియోలు వైరల్‌గా మారుతుండటంతో కార్పొరేటర్లు, నేతలు బయటకు రావాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్టు వారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు.
అయితే ఈ పరిస్థితి నుండి గట్టెక్కేందుకు టీఆర్ఎస్ అధినేత వరద బాధితులకు తక్షణ సాయం అందిచేందుకు సిద్దమయ్యారు. నీట మునిగిన ప్రతి ఇంటికి 10వేల రూపాయలు అందించాలని నిర్ణయించారు. అంతే కాకుండా ఇల్లు కూలిపోతే లక్ష, పాక్షికంగా దెబ్బతింటే 50వేల రూపాయాలు ఇవ్వాలని నిర్ణయించింది.

ఇక పదిహేను రోజులకు సరిపడా నిత్యావసర సరకులు కూడా అందించాలని నిర్ణయించిన సర్కార్ ఆ మేరకు సహాయక చర్యలు ప్రారంభించింది. దీంతో స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నిత్యావసరాల కిట్లతో పాటు పదివేల నగదును బాధితులకు అందజేసేందుకు రంగంలోకి దిగారు. నగరవ్యాప్తంగా నేతలు ఊరుకులు పరుగుల మీద కాలనీల బాట పట్టారు. మారు మూల ప్రాంతాల్లో ఉన్న వారిని సైతం కలిసి ప్రభుత్వ సాయం చేస్తున్నారు.
ఈ సాయంతో ముంపు ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతుందన్న భావనలో ఉన్నారు టీఆర్ఎస్ నేతలు. నగదు సాయం కారణంగా బాధితులకు చేతిలో నేరుగా డబ్బులు రావడం, నిత్యావసరాలు పంపిణీ చేయడం ద్వారా పదిహేను రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం లభిస్తుంది కాబట్టి ప్రజలు ఖుషీ అవుతారంటున్నారు. పనిలో పనిగా మీడియాతో అంతా ఇంతా అని మాట్లాడే బీజేపీ నేతలు ఎలాంటి సాయం చేయలేదని చెప్పుకుంనేందుకు కూడా ఈ అవకాశం వినియోగించుకోవచ్చని భావిస్తున్నాయి గులాబీ శ్రేణులు.
తక్షణ సాయం కింద కేంద్రానికి 5వేల కోట్ల రూపాయాలు ఇవ్వమని అడిగినా ఇప్పటి వరకు సానుకూల స్పందన రాలేదని చెప్పుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజల వద్దకు చేరువ చేసేందుకు ఈ వరద సాయం కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ సాయం ఇప్పటికే పాతాళానికి పడిపోయన టీఆర్ఎస్ పార్టీ పరువు నిలబెడుతుందా లేక బీజేపీ ఈ అవకాశాన్ని వినియోగించుకుని గ్రేటర్ లో పాగావేసేందుకు ప్రయత్నిస్తుందా చూడాలి.











