ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో పోటీ పడకుండా బటన్లు నొక్కడంలోనే పై చేయి సాధిస్తున్నారు. అలా ఐదేళ్లు గడిచే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నింటిలో కింది నుంచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటూ ఉంది. అన్ని రకాల ఇబ్బందుల్లోనూ మొదటి స్థానాల్లో నిలుస్తోంది. మౌలిక సదుపాయాల లేమి, విద్యలో కొరవడిన నాణ్యత, లోపించిన పెట్టుబడులు లాంటి విషయాల్లో వెనక నుండి మొదటి స్థానానికి జగన్ సర్కారు పోటీ పడుతూ ఉంది. తాజాగా నిరుద్యోగంలోనూ దేశంలోనే తొలి స్థానంలో ఉన్న బిహార్ ను వెనక్కి నెట్టి ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. డిగ్రీ పూర్తి చేసుకున్న పట్టభద్రుల నిరుద్యోగంలో ఏపీకి ఈ స్థానం లభించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యాన్యువల్ రిపోర్టులో అత్యధికంగా ఏపీలోనే 24 శాతం నిరుద్యోగ రేటు నమోదైందని తాజాగా వెల్లడైంది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్టు ద్వారా ఈ విషయం బయటికి వచ్చింది. జులై 2022 నుంచి జూన్ 2023 వరకు ఈ సర్వే నిర్వహించారు. దాని ఆధారంగా వార్షిక నివేదికను విడుదల చేశారు. నిరుద్యోగ రేటులో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం రాష్ట్రంలోని నిరుద్యోగుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఉన్న స్కిల్డ్ యూనివర్సిటీలు వైఎస్‌ఆర్ సీపీ పాలనలో దస్త్రాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ నిర్వాకంతో కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోవడంతో ఉపాధి కరవు తప్పడం లేదు.
చంద్రబాబు హాయంలో పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను నాశనం చేసి.. పైగా దాని ఆధారంగా ఆయనపై కేసులు పెట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను యువత కోసం ఉపయోగించకుండా ప్రతిపక్ష నేతను వేధించడానికి వాడుకున్నారు. సీమెన్స్ లాంటి నైపుణ్య కేంద్రాలను మూసేసి మొత్తం యువతకు స్కిల్స్ ని దూరం చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో స్కిల్డ్ యూత్ అందించే రాష్ట్రాలో ఏపీ స్థాయి కిందికి పడిపోతూనే ఉంది. రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. బీటెక్, మామూలు డిగ్రీ చదివిన వారికి ఉద్యోగాలు రాకపోవడంతో ఆన్‌లైన్ కోర్సులు, అదనపు అర్హతలు పెంచుకునేందుకు వారు బాగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఆంధ్రా యువతకు ఇంటర్నేషనల్ లెవెల్ లో ట్రైనింగ్ ఇస్తామంటూ సీఎం జగన్ అరచేతిలోనే వైకుంఠం చూపారు. ఇప్పటిదాకా ఆ నైపుణ్య విశ్వవిద్యాలయాల ఊసే ఎత్తలేదు. ఇంజినీరింగ్ చదివిన వారికి హై ఎండ్ యూనివర్సిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పిన జగన్ సర్కారు దాని గురించే మర్చిపోయింది. ఐటీ సంస్థలను పట్టించుకోవడమే ప్రభుత్వం మానేసింది. కొత్తవి వచ్చే సంగతి అటుంచితే.. ఉన్నవే రాష్ట్రాన్ని వదిలి తెలంగాణకు పోయాయి. ఐబీఎం, హెచ్ఎస్‌బీసీ లాంటి కంపెనీలు కూడా విశాఖ నుంచి వెళ్లిపోయాయి. చంద్రబాబు హాయాంలో విశాఖలోని సిరిపురంలో 3 వేలకుపైగా ఉద్యోగులు అక్కడ పని చేయగా ఆ కంపెనీ ఖాళీ చేసి వెళ్లిపోయింది.











