‘ఇండియన్ హెర్క్యులెస్’ గా పేరుగాంచిన కోడి రామ్మూర్తికి భారత రత్న ప్రకటించాలని శాసన సభాపతి తమ్మినేని సీతారాం కోరారు. కోడి రామ్మూర్తి జయంతి సందర్భంగా బుధవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ బల ప్రదర్శనలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొంది ఇండియన్ హెర్కులస్‌గా పేరుగాంచిన కోడి రామ్మూర్తికి ఎవరూ సాటిరారన్నారు. ఆయన నివాస స్థలాన్ని క్రీడలకు గుర్తుగా తయారు చేస్తామన్నారు. తెలగ యువజన సంఘం అధ్యక్షుడు గుండ బాలమోహన్ ఆధ్వర్యంలో రామ్మూర్తి జయంతి వేడుకలు శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు.
వీరఘట్టంలో జననం
కోడి రామ్మూర్తి నాయుడు (1882 – 1942) ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు. మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. ఈయన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి. ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణ స్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఆయన ఛాతిపై ఒకటిన్నర టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసు సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చారు. విజయనగరంలో శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూల్‌లోనే వ్యాయామ శిక్షకుడుగా చేరారు.
సాహసవీరుడు
కోడి రామ్మూర్తి నాయుడు సాహసవీరుడు. గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు. ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు. రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు. ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు.
ఇంగ్లండు పాలకుల నుండి బిరుదు
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, ‘ఇండియన్ హెర్క్యులెస్’ అనే బిరుదును ప్రసాదించారు. కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా ఈయన సొంతం చేసుకున్నారు.
కలియుగ భీమునిగా పేరుగాంచిన కోడి రామ్మూర్తి నాయుడుకు నేటి వరకు భారతరత్న బిరుదు ప్రసాదించకపోవడం ఆశ్చర్యకరం. ఇటువంటి వ్యక్తులకు ప్రసాదిస్తే ఆ బిరుదుకు సార్ధకత చేకూరుతుందని స్థానికులు భావిస్తున్నారు.