విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఎంతటి మహానటుడో అందరికీ తెలుసు. కానీ ఆయన భాషా పటిమ గురించి చాలామందికి తెలియదు. ఆయన ఎంత అందగాడో ఆయన చేతి రాత కూడా అంత అందంగానూ ఉంటుంది. ముత్యాల్లాటి అక్షరాలతో ఎంతో చూడముచ్చటగా ఉండే ఆయన రాతను మీరూ చూడవచ్చు. అప్పట్లో ‘విజయచిత్ర’ అనే సినిమా పత్రిక ఉండేది. 1966లో ఆయన ముఖచిత్రంతో ప్రచురితమైన ఓ సంచికలో ఆయన రాసిన లేఖ ప్రచురితమైంది.
విజయ చిత్ర కోసం అప్పటి నటుడు, జర్నలిస్టు రావి కొండలరావు అడిగితే ఎన్టీఆర్ రాయక తప్పలేదు. షాట్ గ్యాప్ లో ఎన్టీఆర్ చకచకా ఆ లేఖ రాశారు. మొత్తం మూడు పేజీల లేఖ అది. ఒక్క అక్షరం తప్పు దొర్లకపోవడం ఓ ప్రత్యేకత అయితే, భాషా దోషాలు లేకపోవడం మరో ప్రత్యేకత. పైగా సంయుక్త వాక్యం రాసినప్పుడు ఆ రెండు వాక్యాలకూ దీర్ఘాలు ఉండాలనే సత్యం భాషా పండితులకే సాధ్యం. అది ఎన్టీఆర్ రాతలోనూ కనిపించింది. ‘ఇన్ని విభిన్న పాత్రల రూపకల్పనకూ, నా కార్యదీక్షకూ అండగా నిలిచి’ అనే వాక్యం చూస్తే మీకే అర్థమవుతుంది.
సాధారంగా ఇలాంటి మాటను ‘రూపకల్పనకు, కార్యదీక్షకు’ అంటూ దీర్ఘాలు లేకుండా రాస్తూ ఉంటారు చాలామంది. కామా ఉంది కదా దీర్ఘం ఎందుకు అనే వితం వాదం కూడా చేస్తుంటారు. ఎన్టీఆర్ ఎంత సూక్ష్మంగా ఆలోచించి రాస్తారో అద్దం పడుతుంది ఈ లేఖ. ఎన్టీఆర్ లోని శ్రద్ధ, నిబద్ధత ఎలాంటిదో మచ్చుకు ఈ లేఖ చాలు కదా. అలాంటి రాత ఉండబట్టే దేవుడు ఆయన మంచి తలరాతను ఇచ్చాడు. అలా ఆంధ్రుల హృదయాలను చూరగొన్నారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా ఈ లేఖ ప్రత్యేకతను లియో పాఠకోసం అందిస్తున్నాం.