వలంటీర్లు మెరుపు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. వైపీసీ కార్యకర్తలే వలంటీర్ల రూపంలో జగన్ పార్టీకి, ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారు. తీరా వీరే జగన్ కు ఊహించని దెబ్బకొట్టేందుకు సిద్దమవుతున్నారు.
వలంటీర్లే మా సైన్యం అన్నారు.. వేదికలపై సన్మానించారు. మీరే పార్టీకి అండదండ అన్నారు.. గ్రామాలు.., మున్సిపాలిటీల పెత్తనమంతా మీ భుజస్కందాలపై వేసుకోవాలన్నారు. తీరా కనీస వేతనం.., ఉద్యోగపరంగా ఉన్న సమస్యలను తీర్చమన్న వలంటీర్లకు నేడు జగన్ రెడ్డి మోహం చాటేస్తున్నారు. వలంటీర్ల రూపంలో ఉన్న జగన్ ప్రైవేడు సైన్యమే ఆయన కొంప ముంచనున్నదా..? అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో గ్రామ, వార్డు వలంటీర్లు కూడా అంగన్వాడీ.., ఆశ వర్కర్లు.., సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల మాదిరిగా సమ్మె బాట పట్టనున్నారు. ఇప్పటీకే కృష్ణా, చిత్తూరు జిల్లాలలో ఉన్నతాధికారులకు వలంటీర్లు సమ్మె నోటీసు అందించారు. ఈ నెల 29 నుంచి సమ్మెలోకి వెళ్లి.. వలంటీర్ల విధులకు పూర్తిగా దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు జగన్ క్వాటరీని కలవర పెట్టిస్తోంది. జగన్ మానసపుత్రికలా భావించే సచివాలయాల్లో కీలక పాత్ర పోషించే వలంటీర్లే.. ఇలా రివర్స్ గేర్ వేయడం జగన్ కు మింగుడుపడడం లేదనే చెప్పాలి.
జగన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాల అమలకు వలంటీర్ల పాత్ర అత్యంత కీలకం. దాదాపు 2.69 లక్ష మంది వైసీపీ కార్యకర్తలను.., సానుభూతిపరులను వలంటీర్లుగా ఎంపిక చేశారు జగన్. వారితో ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలు చేయిస్తూ.. నాలుగేళ్ళుగా అన్నీ విధాలుగా వాడుకుంటూ పబ్బం గడిపారు. కానీ వలంటీర్ల వెతలు జగన్ రెడ్డి ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్న దాఖలాల్లేవు. వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. వేదికలపై మర్యాదులు ఫుల్.. మని నిల్ అన్న చందగా మా బతుకులు మారాయి అని గొంతెత్తి నిలదీసిన వలంటీర్ల గోడు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డిని నమ్మి నానా విధాలుగా నష్టపోయామని.., తక్కువ వేతనాలతో మా జీవితాలను గుళ్ల చేసుకున్నామని నేడు తలలు పట్టుకుంటున్నారు. స్ధానిక వైసీపీ నేతలు చెప్పినట్లు చేసి.. గ్రామాల్లో ప్రత్యర్ధి పార్టీలకు తాము టార్గెట్ అయ్యామని వలంటీర్ల మదనపడుతున్నారు.
ఈ నేపధ్యంలో ఎన్నికల ముందు ఎలక్షన్ డ్యూటీ అంటూ తమను అడ్డమైన పనులకు వాడుకుంటారని గ్రహించి.., ముందే మేల్కొని సమ్మె బాట పట్టేందుకు సిద్దమవుతున్నారు వలంటీర్లు. వలంటీర్లను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా.. ఇప్పటికైనా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. సచివాలయం ఉద్యోగుల మాదిరిగానే వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి.., గౌరవ వేతనం 18 వేల వరకు ఇవ్వాలి కోరుతున్నారు. వీటితో పాటు అర్హతలను బట్టి సచివాలయ వ్యవస్ధలో వలంటీర్లను విలీనం చేసి క్రమబద్దీకరించాలని డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వలంటీర్లు సమ్మె బాట పట్టేందుకు నిర్ణయించుకున్నారు.
ఇలా ఒకవైపు వైపీసీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే.., మరోవైపు జగనన్న సైన్యంలా చెప్పుకునే వలంటీర్లు కూడా సమ్మె బాట పట్టడంతో తాడేపల్లి ప్యాలెస్ కలవరపాటుకు గురివుతోందని సమాచారం.