మనిషి జాతకంలో ఓ ప్రత్యేక అంశం గురించి చర్చించాల్సిన సమయమిది. మనిషి మరణాన్ని ముందే ఊహించ వచ్చా. జాతకంలో గ్రహాల కదలికల్ని బట్టి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అంచనా వేయగలమా? బాలు మరణాన్ని ముందు ఊహించలేకపోయామా? సాధారణంగా మరణం లాంటి విషయాల గురించి ఏ జ్యోతిష్కుడూ మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మనిషి బతికుండగా అతను తన ఆయుషు గురించి అడిగితే మనం వారికి భరోసా ఇచ్చేలానే జ్యోతిష్కుడు వ్యవహరించాలి. ఎందుకంటే ముందే మరణిస్తామని తెలిస్తే ఆ పిరికితనమే మనిషిని చంపేస్తుంది. మరణాలను ఎలా అంచనా వేయవచ్చో గ్రహాల కదలికలను బట్టి అంచనా వేయగలం. అలా అని ఆ కాంబినేషన్ ఉంటే మరణిస్తాడని కాదు. అతను ఆస్పత్రి పాలవవచ్చు, ప్రమాదాల బారిన పడి చావు తప్పి కన్నులొట్టపోవచ్చు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో పుట్టారు. 1946 జూన్ 4 ఆయన పుట్టిన తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ఆశ్లేష నక్షత్రం రెండో పాదం లో ఆయన పుట్టారు. ఆశ్లేష అనేది బుధుడి నక్షత్రం. అంటే ఆయనది కర్కాటక రాశి. ప్రస్తుతం ఆయనకు రాహుమహా దశ నడుస్తోంది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన కన్నుమూశారు. మరి ఆ రోజు ఉన్న గ్రహస్థితులు ఏమిటి? బాలు మరణానికి కారణమైన గ్రహాలు ఏమిటి అనే సమగ్ర విశ్లేషణ ఈ కింది వీడియోలో ఉంది. చివరి వరకూ చూడండి.
23 తర్వాత మారిన గ్రహాలు ఏంచేశాయి?
ఈ నెల 23 వరకు ఉన్న బాలు ఆరోగ్యం వేరు, ఆ తర్వాత ఉన్న ఆరోగ్యం వేరు. ముఖ్యంగా బాలు కరోనా బారిన పడి ఆస్పత్రి పాలవడానికి మిధునంలో ఉన్న రాహువు ప్రభావమే కారణం. గోచార రాహువు జాతక రాహువుకు అత్యంత సమీపంలో ఉన్నాడు. కానీ కొంత కోలుకున్న బాలు ఒక్క సారిగా తీవ్ర విషమ పరిస్థితికి చేరువవడానికి కారణం ఈ నెల 23వ తేదీ జరిగిన రాహకేతువుల రాశి మార్పులే. బాలు జన్మ కుండలిలో ఉన్న రాహువు మీదకు గోచార రాహువు చేరుకున్నాడు. మనిషి ప్రాణాలు తీయడంలో రాహుకేతువులే కీలక పాత్ర వహిస్తున్నాయని భృగు నందినాడి జాతక విధానం చెబుతోంది. కర్మ కారకుడు శనికి కేతువుతో సంబంధం ఉండి, జీవ కారకుడు గురువుకు రాహువుతో సంబంధం ఉన్నపుడు ఎక్కువగా ఆ జాతకుడు మరణించడం జరుగుతుంది.
గోచార కేతువు ప్రభావం శని మీద పడింది. దాంతో ఆయన కర్మ ముగిసిపోయింది. కేతువు విముక్తి కారకుడు అనే విషయాన్ని మనం మరువకూడదు. ప్రమాదాలు, హత్యలు, సహజ మరణాలకు కూడా ఇదే కారణమే ఉంటుంది. ఒకవేళ బాలు మరణం ఈ నెల 24వ తేదీ జరగకపోయినా రాహుకేతువులు వృషభం, వృశ్చికంలో ఉండే ఏడాదిన్నర కాలం కూడా ఆయనకు ఇబ్బందికరమే అయి ఉండేది. అయినా మరణం అనేది మన చేతుల్లో ఉండేది కాదు. అది భగవంతుడి నిర్ణయం. ఎన్నో పుణ్యకర్మల ఫలితం వల్లే బాలు ఇక్కడ జన్మ తీసుకుని గాన గంధర్వుడిగా మారారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుందాం.