జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్తగా కొన్ని ప్రశ్నలు సంధించారు. అవి చాలా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ముందు ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలను చూద్దాం.
ఒక ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం కోసం 150 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు చేస్తారు. ఇలాంటి విపత్తుల సమయంలో అందులో ఓ 50 కోట్లు ఖర్చు పెట్టలేరా? విరాళాలు సరిపోవడం లేదనేవారు తమ జేబుల్లో నుంచి ఏమైనా ఇచ్చారా? లాంటి ప్రశ్నలను ఆయన సంధించారు. సినిమా వాళ్ల ఆర్థిక వ్యవహారాల మీద కూడా ఆయన స్పందించారు. కోటి రూపాయలతో సినిమా తీస్తే 10 కోట్ల పేరొస్తుందని, ఇక్కడ పేరున్నంతగా వారి చేతుల్లో డబ్బుండదని చెప్పారు.
‘ఆరెంజ్’ సినిమా చేసినప్పుడు తన అన్న నాగబాబు ఎంతటి ఆర్థిక సంక్షోభాన్ని అనుభవించారో గుర్తుచేసుకున్నారు. అసలైన సంపదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర, పారిశ్రామిక వేత్తల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర ఉన్నప్పుడు వారెందుకు ఇవ్వలేరనేది ఆయన మరో ప్రశ్న. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత సంపన్నులది కాదు ప్రభుత్వానిదేనని, అయితే ఇలాంటి సమయంలో సంపన్నులు కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.
సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో , సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు అని కూడా వ్యాఖ్యానించారు. ఇలా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అనేక అంశాలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాజకీయ నాయకులైతే తమ జేబుల్లో నుంచి రూపాయి కూడా తీయరు. ముఖ్యంగా ఎవరెవరో ఇచ్చే విరాళాలను స్వీకరించే ముఖ్యమంత్రులు కూడా తమ నుంచి ఎలాంటి విరాళాన్నీ ప్రకటించారు. ఆయనే అలా ఉన్నపుడు ఆయన మంత్రి వర్గ సహచరులు స్పందించక పోవడంలో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
రాజకీయ నాయకులు వసూల్ రాజాలు. వారు ఇవ్వరు తీసుకుంటారంతే. పవన్ కళ్యాణ్ గొంతువిప్పి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తుతున్నపుడు సినిమా వాళ్లు భారీగా విరాళాలు ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతోంది. ఎన్టీఆర్, ఏయన్నార్ ల హయాంలో కూడా వారు డబ్బులు ఇవ్వడమే కాకుండా జోలెపట్టి డబ్బులు వసూలు చేసి ప్రజలను ఆదుకోవడానికి పూనుకున్న ఘటనలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే వచ్చారు కాబట్టి ఆయన ప్రశ్న ఒక్కటే ఎప్పుడూ సినిమావాళ్లే విరాళాలు ఇవ్వాలా? ఇతర వ్యాపారులు, రాజకీయ నేతలు విరాళాలు ఇవ్వరా ? అనే ప్రశ్నలను ఆయన సంధిస్తున్నారు.
ఆయన మాటల్లో కొంత లాజిక్ అయితే ఉంది. సినిమా వ్యాపారాన్ని ఇతర వ్యాపారాలతో ముడిపెట్టడానికి వీల్లేదు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే పవన్ మాటల్లో వాస్తవం ఉంది. వారు విరాళాలు వసూలు చేయడమే తప్ప ఇవ్వడం అంటూ ఉండదు. విరాళాలు అనేవి ఎవరికి వారు స్పందించి ఇవ్వాలని కూడా పవన్ అంటున్నారు. ఎందుకు ఇవ్వలేదని అడగడానికి వీల్లేదంటున్నారాయన. నేతలు, వ్యాపారులతో పోలిస్తే సినిమా వాళ్ల వద్ద ఉన్న డబ్బు తక్కువేనన్నది ఆయన అభిప్రాయం.
విరాళాలను ఒకరు ఇచ్చి ఇంకొకరు ఇవ్వకపోతే బాగుండదన్న ఉద్ధేశంతో బలవంతంగానే కొందరు ఇస్తున్నారన్నది దీన్ని బట్టి కూడా అర్థమవుతోంది. ఇవ్వలేని వారు మాత్రం చాలా ఇరకాటంలో పడుతున్నారు. నిజానికి పవన్ అన్నట్లు అందరూ డబ్బున్న వారిలా బిల్డప్ ఇస్తారుగానీ వారు అప్పటికే అప్పుల్లో మునిగిపోయి ఉన్నవారు కూడా ఉంటారు. సినిమావారి కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూస్తేనే అర్ధమవుతుంది. అసలు సినిమా వారు తమ పరిశ్రమ వ్యక్తుల్ని ఆదుకుంటే చాలు. మిగతావారి దగ్గరున్నంత డబ్బు మాత్రం సినిమా వారిలో ఉండదు. అది కూడా నలుగురైదుగురి దగ్గర కేంద్రీకృతమై ఉంది.
పారిశ్రామిక వేత్తల మాట ఎలా ఉన్నా రాజకీయ నాయకులు విరాళాలు ప్రకటించి ఉంటే పవన్ ఈ మాట అనేవారు కాదేమో. అయితే ఇక్కడో చిక్కు కూడా ఉంది. వారు ఎన్నికల కోసం ఆస్తుల్ని తక్కువ చేసి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి విరాళాలు ప్రకటించాలంటే అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలి కదా. అందుకే విరాళాలు ఇవ్వలేకపోతున్నారేమో. దీనికి ఆ రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో చూడాలి.
-హేమసుందర్











