ఆంధ్ర ప్రదేశ్ పోలీసులపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. మీరు పోలీసులా ? ప్రైవేట్ సైన్యమా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లాలో మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరింపులకు గురిచేస్తుండడం పై టిడిపి నేత , మాజీ మేయర్ హేమలత పోలీసులను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల తీరుకు నిరసనగా ఆమె వారి వాహనాలకు అడ్డంగా బైటాయించి ఆందోళన చేపట్టారు.
వాస్తవానికి మేయర్ దంపతుల హత్య కేసులో హేమలత అనుచరుడైన ప్రసన్న తమ్ముడు పూర్ణ సాక్షిగా ఉన్నాడు.కాగా, పూర్ణ గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నాడంటూ గత రాత్రి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు.విషయం తెలుసుకున్న హేమలత పూర్ణ ఇంటి వద్దకు చేరుకుని వచ్చి ఆందోళనకు దిగారు. ఆ బస్తాల్లో ఏముందో చూపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. అందుకు పోలీసులు నిరాకరించడంతో హేమలత ఆందోళనకు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఆమె కాళ్లపై నుంచి పోలీసు జీపు ఎక్కించడంతో ఆమె కాళ్లకు గాయాలయ్యాయి.ఈ అంశంలో పోలీసులు తాజాగా హేమలత పై కేసు నమోదు చేశారు. కాగా, న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం పై లోకేష్ స్పందించారు.
హత్యకేసులో సాక్షులకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడమే మాజీ మేయర్ హేమలత చేసిన నేరమా? అని ట్విటర్ వేదికగా పోలీసులను ప్రశ్నించారు. పోలీసులూ! మీరు ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న పోలీసులా లేక.. వైఎస్ జగన్ మాఫియా రెడ్డి ఫ్యాక్షన్ నడిపే ప్రైవేటు సైన్యమా? అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పోలీసులే అమాయకుడైన పూర్ణ జేబులో గంజాయి పెట్టి అమ్ముతున్నాడని అరెస్టు చేయడం.. ఇదేం అన్యాయం అని నిలదీసిన హేమలత మీద నుంచి పోలీసు వాహనం పోనిచ్చారంటే వీళ్లంతా పోలీసులు కాదు. వైసీపీ ఫ్యాక్షన్ టీం’’ అని నారా లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.