గ్రహాలు ఒక వరుసలోకి రావడం చాలా అరుదు.కారణం.. అవన్నీ సూర్యుడి చుట్టూ వేర్వేరు దూరాలతో, వేర్వేరు వేగంతో తిరుగుతుండటమే. కానీ సౌర కుటుంబంలో ఓ అధ్బుతమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఐదు గ్రహాలు ఒకే వరసలో కనిపించనున్నాయి.ఈ అరుదైన ఘట్టానికి ఈ నెల వేదిక కానుంది.ఆ వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
సౌర కుటుంబంలో భూమి సహా ఎనిమిది గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అయితే అవన్నీ సూర్యుడి చుట్టూ వేర్వేరు దూరాలతో, వేర్వేరు వేగంతో తిరుగుతూ ఉంటాయి.అవి ఉన్న ఒకే వరుస క్రమంలో కనబడటం అత్యంత అరుదుగా చోటుచేసుకుంటూ ఉంటుంది.గ్రహాలలో రెండు లేదా మూడు ఒకే వరసలోకి రావడం కాస్త అరుదుగా చూస్తుంటాం.కానీ ఐదు గ్రహాలు వరుస క్రమంలోకి రావడం చాలా అరుదు.ప్రస్తుతం అటువంటి ఒక అద్భుతమైన ఘటటమే చోటుచేసుకోబోతోందట. దానికి ఈ నేలే వేదిక కాబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకదాని వెనుక మరొకటిగా ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయట. చివరిసారిగా ఇటువంటి అరుదైన ఘట్టం 1864వ సంవత్సరంలో కనిపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మళ్ళీ 158 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ అద్భుత దృశ్యం కనిపించనుందని అంటున్నారు.ఈ నెల 23వ తేదీ నుంచే ఈ వరుస క్రమం ప్రారంభమైందని.. ఈ ఐదు గ్రహాలకు తోడు ఈ నెల 23, 24, 25 తేదీల్లో చందమామ కూడా వరుసలోకి వచ్చి కనువిందు చేస్తుందని అంటున్నారు.ఇక 26, 27 తేదీల్లో ఈ ఘట్టం మరింత అద్భుతంగా కనిపిస్తుందని అంతరిక్ష నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ రోజుల్లో తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు తూర్పు దిశ నుంచి నైరుతి దిశ వరకు వరుసగా ఈ గ్రహాలు కనిపిస్తాయట. అయితే భూమిపై వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లో కాస్త ముందూ, తర్వాతా ఈ దృశ్యం కనిపిస్తుందు చేయనుందట.మరో నాలుగైదు రోజుల పాటు కూడా కాస్త దూరంగా ఈ కలయిక కనిపిస్తుందని.. తర్వాత గ్రహాలు దూరదూరంగా వెళ్లిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
వాస్తవానికి ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలే అయినప్పటికీ.. వాటిపై సూర్య కాంతి పడి ప్రతిఫలించే క్రమంలో అవి మనకు ఆకాశంలో చుక్కల్లా కనిపిస్తాయట.ఆకాశంలో తూర్పు–ఈశాన్య ప్రాంతంలో దిగువగా కాస్త తక్కువ ప్రకాశవంతంగా బుధ గ్రహం కనిపిస్తుందట.దాదాపు తూర్పు దిశలో ప్రకాశవంతంగా మిణుకు మిణుకు మంటూ కనిపించేదే శుక్ర గ్రహం.తూర్పు–ఆగ్నేయ దిశలో కాస్త ఎగువన అంగారక గ్రహం.. దాదాపు ఆగ్నేయ దిశలో మరికాస్త ఎగువన బృహస్పతి అంటే జూపిటర్ ప్రకాశవంతగా కనిపిస్తుందట.ఇక దక్షిణ దిశలో బృహస్పతికి కాస్త దిగువన శని గ్రహం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా, తర్వాతి సారి ఐదు గ్రహాల కలయిక కూడా త్వరలోనే ఉండబోతోందని శాస్త్రవేత్తలు తమ అంచనాలను వెల్లడించారు. ఈసారి 2040లో ఇవే తీరులో గ్రహాల కలయిక ఏర్పడనుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
మొత్తానికి ఐదు గ్రహాలు, చందమామ ఒక విల్లులా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.