పోస్కో కంపెనీకి, జగన్‌కు మధ్యవర్తిగా విజయసాయిరెడ్డి ఎన్నిసార్లు పూణే వెళ్లారో తన వద్ద ఆధారాలు ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన విషయాలు వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేస్తున్న నిరాహార దీక్షకు అయ్యన్న మద్దతు పలికారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ప్రత్యేక విమానంలో పూణే వెళ్లి పోస్కో ప్రతినిధులతో ఎన్నిసార్లు చర్చలు జరిపారో తన వద్ద ఆధారాలు ఉన్నాయని అయ్యన్న సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి 2019లో పోస్కో ఎండీకి శాలువా కప్పి సన్మానించిన ఫోటోలను అయ్యన్న మీడియాకు మరోసారి విడుదల చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు లేవని వైసీపీ నాయకులు చెబుతున్నారని, మరి పోస్కో కంపెనీకి సొంత గనులు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.
విశాఖ భూములపై జగన్ కన్నేశారు
విశాఖలో విలువైన భూములు కాజేసేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి కన్నేశారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమను పోస్కో కంపెనీ పేరుతో కొట్టేసేందుకు స్కెచ్ వేశారన్నారు. ఈ వ్యవహారంలో జగన్‌కు, పోస్కో కంపెనీ యాజమాన్యానికి మధ్యవర్తిగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తే లక్షమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటుకు అప్పగిస్తే భూములు అమ్ముకుని వెళ్లిపోతారని ఆయన అన్నారు.