తెలుగు తెరపై చందమామలా ఒక వెలుగు వెలిగిన కథానాయికలలో సౌందర్య ఒకరు. సౌందర్యను చూడగానే పేరుకు తగినట్టుగానే ఉందని అనుకున్నారు. ఆ తరువాత అభినయంలోను ఆమెకి తిరుగులేదని తెలుసుకున్నారు. చిన్న సినిమాతోనే తన కెరియర్ ను మొదలుపెట్టిన సౌందర్య, ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగిపోయింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లోను స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఒక హిందీ సినిమాలోను మెరిసింది. ఎలాంటి స్కిన్ షో చేయకుండా కేవలం నటనపరంగానే ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న కథానాయికగా సౌందర్య నిలిచింది.
అందానికీ .. అభినయానికి ప్రతీకగా నిలిచిన సౌందర్య .. దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో మరణించింది. అయినా ఇప్పటికీ అంతా ఆమెను తలచుకుంటూనే ఉన్నారు .. ఆమె నటనలో గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాంటి సౌందర్య బయోపిక్ లో నటించే అవకాశం వస్తే ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోనని రష్మిక అంటోంది. సౌందర్య పాత్రలో మెప్పిస్తే తనకి అంతకు మించిన సంతృప్తిలేదని చెబుతోంది. తాను సౌందర్యకు వీరాభిమానిననీ, అందువలన ఆమె బయోపిక్ లో చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. మరి అందుకు పూనుకునే దర్శక నిర్మాతలు దొరకాలంతే.
ఇక ఇటీవల తాను పారితోషికం పెంచినట్టుగా వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని రష్మిక స్పష్టం చేసింది. తన సినిమాల సక్సెస్ రేట్ .. తనకి గల క్రేజ్ .. డిమాండ్ ను బట్టే పారితోషికం అందుకుంటూ వస్తున్నానని చెప్పింది. పారితోషికం విషయంలో ఇంతవరకూ ఎవరినీ ఇబ్బంది పెట్టింది లేదని అంది. క్రితం ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ .. ‘భీష్మ’ సినిమాలతో చాలా తక్కువ గ్యాప్ లో రెండు హిట్లను అందుకుంది. ఈ ఏడాది ‘పుష్ప’ సినిమాతో హిట్టు కొట్టడం ఖాయమనే నమ్మకంతోనే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.