ఆ ఇద్దరు భారతీయ జనతా పార్టీలో తెలుగు రాష్ట్రాల నుంచి కీలక వ్యక్తులు. నరేంద్ర మోదీ గత ప్రభుత్వంలో చక్రం తిప్పింది వారే. తెలుగు రాష్ట్రాలలో కమలనాథులకు వారిద్దరే పెద్ద దిక్కు. ఇప్పుడు ఆ దిక్కులే దిక్కులు చూస్తే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా…. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాం మాథవ్ అయితే, మరొకరు తెలంగాణాకు చెందిన మురళీధర్ రావు. వీరిద్దరూ గతంలో భారతీయ జనతా పార్టీలో కీలక వ్యక్తులు. ఇప్పుడు మాత్రం కొత్తగా ప్రకటించిన కార్యవర్గంలోనే కాదు… ఏ బాధ్యతలు లేని నాయకులు అయిపోయారు.
ఇంతకు ముందు బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే పనిని మురళీధర్ రావుకు అప్పగించింది అధిష్టానం. అలాగే కాశ్మీర్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డమక్రెటిక్ పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాంమాథవ్ కు అప్పగించారు. ఈ రెండు కీలక అంశాలలో రాంమాథవ్ విజయం సాధిస్తే… మురళీధర రావు మాత్రం అపజయం పాలయ్యారు. అంతే కాదు…. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ మీడియా మురళీధర్ రావుపై కథనాలు ప్రచురించింది. దీంతో పార్టీ సుప్రీములు నరేంద్ర మోదీ, అమిత్ షా మురళీధర్ రావును వెనక్కి పిలిపించారు. దీని ప్రభావమే ఇప్పుడు జాతీయ కార్గవర్గంలో కాని, మరో కార్యవర్గంలో కాని చోటు లేకుండా చేసిందంటున్నారు.
రాం మాధవ్ నోటి దురుసే…
ఇక నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వంలో ఎంతో కీలక వ్యక్తిగా వ్యవహరించారు వారణాసి రాంమాథవ్. ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలను చక్కదిద్దే పనితో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం రాంమాథవ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి. ఈ సారి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి గతంలో వచ్చినన్ని స్ధానాలు రాకపోవచ్చునని ఆ వ్యాఖ్యల సారాంశం. ఎన్నికలకు మరో పదిహేను రోజులు గడువు ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి నష్టం కలిగిస్తుందని అప్పట్లో బీజేపీ సీనియర్ నాయకులు మండిపడ్డారు. అయితే, రాం మాధవ్ జోస్యం దెబ్బతిని గతం కంటే ఈసారి బీజేపీకి చాలా ఎక్కువ స్థానాలు వచ్చాయి. అదిగో అప్పటి నుంచి రాం మాథవ్ ను కాసింత దూరం పెట్టారు మోదీ, షా ద్వయం. ఇప్పుడు ఏకంగా ఎలాంటి పదవి ఇవ్వకుండా మరింత దూరం చేసారని పార్టీ సీనియర్లు అంటున్నారు.
మంత్రివర్గంలోకి తీసుకుంటారా…
అయితే, మరోవైపు ఈ ఇద్దరు సీనియర్ నాయకులను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీలోని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. రాం మాథవ్, మురళీధర్ రావులకు క్యాబినెట్ లో స్థానం కల్పించడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే రాంమాథవ్ కు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అంతర్గత చర్చల్లో కొందరు నాయకులు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. దీనిపై ప్రధాని కూడా సానుకూలంగా వ్యవహరించారని చెబుతున్నారు. ఇటీవల ఒక మంత్రి మరణించడం, మరో మంత్రి రాజీనామా చేయడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు రాం మాథవ్, మురళీధర్ రావులకు క్యాబినెట్ లో అవకాశం కల్పించవచ్చునని అంటున్నారు.










