కర్ణాటక కొత్త సీఎంగా ఆ రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్ బొమ్మై ఎంపికయ్యారు. సోమవారం నాడు సీఎం పదవికి రాజీనామా సమర్పించిన బీఎస్ యడియూరప్ప వారసుడిగా బసవరాజ్ ను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యాకట శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ అధిష్ఠానం పంపిన కమిటీ బొమ్మైని కర్ణాటకకు కొత్త సీఎంగా ఎంపిక చేసింది. సోమవారం యడ్డీ రాజీనామా చేయగా.. మంగళవారం కొత్త సీఎంగా బసవరాజ్ ను కొత్త సీఎంగా ఎంపిక చేస్తే.. బుధవారం ఆయన కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. అంటే.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి బీజేపీ అధిష్టానం ముగింపు పలికినట్టైంది.
మాజీ సీఎం కొడుకే బసవరాజ్..
కర్ణాటక కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న బసవరాజ్ బొమ్మై తండ్రి ఎస్ఆర్ బొమ్మై సీనియర్ రాజకీయవేత్తే. సా్తంత్య్ర సమరయోధులైన ఎస్ ఆర్ బొమ్మై.. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో హెచ్ డీ దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ల మంత్రివర్గాల్లో కేంద్ర మానవ వనరుల అబివృద్ధి మంత్రిగా పనిచేశారు. అంతకుముందు కర్ణాటకకు సీఎంగానూ వ్యవహరించిన సీనియర్ బొమ్మై.. కేవలం 8 నెలల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. కర్ణాటక శాసనసభ్యుడిగా, లోక్ సభ సభ్యుడిగా పలుమార్లు ఎంపికైన సీనియర్ బొమ్మై రాష్ట్ర రాజకీయాల్లో కంటే కూడా జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో సత్తా చాటారు. ఎస్ ఆర్ బొమ్మై రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బసవరాజ్ బొమ్మై తొలుత జనతాదళ్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంబించారు. ఆ తర్వాత 2008లో బీజేపీలో చేరిన ఆయన అప్పటినుంచి కమలదళంలోనే కొనసాగుతున్నారు. యడియూరప్పకు అత్యంత నమ్మకస్తుడిగా పేరుపడ్డ బసవరాజ్.. యడ్డీ కేబినెట్ లో హోం మంత్రిగా పనిచేస్తున్నారు. తాజాగా సీఎం పదవికి రాజీనామా చేసిన యడ్డీ.. తన వారసుడిగా బసవరాజ్ నే ప్రతిపాదించినట్లుగా సమాచారం.
బసవరాజ్ కూడా లింగాయతే
ఇక కన్నడ నాట ఇటీవల సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడిన యడ్డీ నేతృత్వంలో పనిచేసేందుకు చాలా మంది మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. ఈ క్రమంలోనే యడ్డీని సీఎం పదవి నుంచి దింపాల్సిందేనంటూ చాన్నాళ్లుగా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ కూడా యడ్డీని దించేసి కొత్త సీఎం ఎంపికకే మొగ్గు చూపింది. ఈ క్రమంలో కన్నడ రాజకీయాలను శాసిస్తున్న లింగాయత్ సామాజిక వర్గం నుంచే కొత్త సీఎంను ఎంపిక చేయాలని అధిష్ఠానం తలపోయగా.. బసవరాజ్ ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం లభించిందట. దీంతో కిషన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ పెద్దగా శ్రమ పడకుండానే కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మైను ఎంపిక చేసింది. తండ్రి సీనియర్ బొమ్మై 8 నెలల పాటే కర్ణాటకకు సీఎంగా కొనసాగగా.. ప్రస్తుతం ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో జూనియర్ బొమ్మై ఎన్ని రోజులు ఆ సీట్లో కూర్చుంటారోనన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కన్నీళ్లు పెట్టుకుని.. నేలపై కూర్చుని..