తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలు శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకగానే చెప్పుకోవాలి. అందులో తెలంగాణలోని రామప్ప గుడి విషయానికి వచ్చేసరికి.. ఆ గుడి అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి నెలవని చెప్పక తప్పదు. అందుకే కాబోలు.. తాజాగా రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినట్టు యునెస్కో ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తద్వారా కాకతీయ రాజుల కాలం నాటి శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటిందని చెప్పక తప్పదు. చైనాలో జరిగిన ఓ వర్చువల్ సమావేశంలో ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ ఆదివారం నాడు ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప గుడే. 2020 సంవత్సరానికి గాను భారత్ నుంచి ఇదొక్క ఆలయమే ఈ జాబితా కోసం నామినేట్ అయింది. 2019లో యునెస్కో ప్రతినిధులు రామప్ప గుడిని సందర్శించారు.
ములుగు జిల్లాలో ఆలయం..
ఇక రామప్ప గుడి వివరాల్లోకి వస్తే.. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల కిందట కాకతీయుల హయాంలో ఈ ఆలయం నిర్మితమైంది. అపురూప శిల్పాలకు చిరునామాగా విలసిల్లే రామప్ప గుడిని క్రీస్తు శకం 1213లో నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ గుడిని చెక్కిన శిల్పి పేరుతోనే ప్రాచుర్యంలోకి రావడం విశేషం. ఇది ప్రధానంగా శివాలయం. ఇందులో రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. దీనిని కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఆ కాలంలో ఇంతటి అద్భుత శిల్పకళా నైపుణ్యంతో మరే ఆలయం లేకపోవడంతో, అందులోని దేవుడి పేరుమీద కాకుండా, ఆలయాన్ని తీర్చిదిద్దిన శిల్పి రామప్ప పేరిట పిలవడం ప్రారంభించారు. రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.”అద్భుతం….తెలంగాణ ప్రజలకు అభినందనలు. ప్రతి ఒక్కరూ ఈ దివ్యమైన కట్టడాన్ని దర్శించాలని కోరుతున్నాను. అక్కడి శిల్ప సౌందర్యాన్ని వీక్షించి ముగ్ధులు కండి” అని ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా ఇదే రీతిన హర్షం ప్రకటించారు.
కిషన్ రెడ్డి ప్రమేయమున్నట్టేనా?
ఇదిలా ఉంటే.. ఇటీవలే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమోషన్ ఇచ్చారు. కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డిని నియమించిన మోదీ.. ఆయనకు పర్యాటకం, సాంస్కృతిక శాఖలను కట్టబెట్టారు. మరి కిషన్ రెడ్డి ప్రభావమో, లేదంటే యాదృశ్చికంగానే జరిగిందో తెలియదు గానీ.. కిషన్ రెడ్డి సాంస్కృతిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే రామప్ప గుడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏ మంత్రి అయినా తన శాఖ వ్యవహారాలతో పాటు తన సొంత ప్రాంతానికి కాస్తంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కదా. ఆ కోవలోనే కిషన్ రెడ్డి చొరవతోనే ఇప్పుడు రామప్ప గుడికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.