వైసీపీ అధికారంలోకి వస్తే.. రైతు అనే వాడు కష్టాలు పడనే పడడు. అతడిని అన్ని విధాలా ఆదుకునేలా మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందుకోసం నవరత్నాల్లోనే ఓ ఆణిముత్యం లాంటి వైఎస్సార్ రైతు భరోసా క్రియాశీలకంగా పనిచేయనుంది. రైతులకు గిట్టుబాటు ధరలతో పాటుగా వ్యవసాయానికి అవసరమైన అన్ని పనిముట్లు, విత్తనాలు, ఎరువులు.. వారి గడప దగ్గరకే అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగానే ప్రకటించారు. ఈ మాట నిజమేనేమోనని నమ్మిన ఏపీ ఓటర్లు జగన్ పార్టీకి ఓట్లు గుద్దేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాను ప్రారంభించినా.. దాని నిధుల కోసం కేంద్ర పథకం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. అసలు రైతు భరోసా అర్హులకు అందుతుందా? లేదా? అని పరిశీలించే వ్యవస్థే లేదు. ఇక రైతు భరోసా కేంద్రాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గిట్టుబాటు ధర అంటున్న జగన్ సర్కారు.. అన్నదాతల పంటలను కొనుగోలు చేస్తూ.. వాటికి సకాలంలో సొమ్ములు చెల్లించే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వెరసి ఏపీలో అన్నదాతలు ప్రభుత్వం నుంచి కనీస భరోసా లభించక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదేదో జగన్ పార్టీ అంటే గిట్టని వారు చెబుతున్న మాట కాదు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి కేంద్రం పార్లమెంటు వేదికగా చెప్పిన పక్కా లెక్కల మాట.
తెలంగాణలో తగ్గుముఖం
మరి పొరుగు రాష్ట్రం తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే.. 2017లో 846 మంది రైతులు ఆ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటే.. 2019లో ఆ సంఖ్య 491కి పడిపొయింది. సగాన సగం అని చెప్పలేం గానీ.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని మాత్రం చెప్పాలి. రెండేళ్లలోనే ఈ మేర మార్పు కనిపించిందంటే.. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చాలానే చేస్తున్నట్లే కదా. రైతు బంధు కింద కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన పథకం బాగానే పనిచేసిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో రైతు భరోసా మాదిరిగా కాకుండా.. రైతు బంధు కింద ఎకరాకు రూ.8వేల లెక్కన కేసీఆర్ సర్కారు రైతులకు పెట్టుబడి సాయం చేస్తోంది. ఆ పథకం కంటే కూడా తాము మెరుగ్గా పనిచేస్తున్నామని, రైతు బంధు కంటే రైతు భరోసానే మెరుగైన పథకమని డబ్బాలు కొట్టుకుంటున్న జగన్ సర్కారు మాత్రం ఒక్కో రైతుకు ఎంత భూమి ఉందన్న విషయాన్ని పక్కనపెట్టేసి.. ఎంత మేర భూమి ఉన్నా.. రైతు భరోసా కింద ఆ రైతుకు కేవలం రూ.13,500 మాత్రమే ఇస్తోంది. అంటే.. అరెకరం ఉన్న రైతుకు అంతే మొత్తం. ఆరెకరాలు ఉన్న రైతుకూ అంతే మొత్తమన్న మాట. ఈ లెక్కన రైతు భరోసా అన్నదాతల్లో భరోసా నింపేదెలా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీలో రైతు ఆత్మహత్యల పెరుగుదల
ఇక ఏపీలో అన్నదాతల ఆత్మహత్యల వివరాలు ఎలా ఉన్నాయన్న విషయానికి వస్తే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో ఏపీలో 375 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ మరుసటి ఏడాది 2018లో ఈ సంఖ్య కాస్తంత తగ్గి 365గా నమోదైంది. అదేంటో గానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 ఏడాదిలో మాత్రం ఏపీలో 628 మంది అన్నదాతలు బలవర్మణానికి పాల్పడ్డారు. అంటే.. ఏపీలో ఆత్మహత్యలు డబుల్ అయ్యాయని చెప్పలేం గానీ.. ఆందోళన కలిగించే స్థాయిలో మాత్రం పెరిగిపోయాయని చెప్పక తప్పదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. 2017లో 846 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. 2018లో ఆత్మహత్యలు 900కు పెరిగాయి. 2019లో రైతు ఆత్మహత్యలు ఏకంగా 491కి తగ్గాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు రైతుల ఆత్మహత్యలకు సంబందించి గణాంకాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు.
Must Read ;- జగన్ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది!