బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప.. పేరేదో కొత్తగా ఉందా? అదేనండీ సోమవారం ఉదయం కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన బీఎస్ యడియూరప్ప. సీఎం పదవికే రాజీనామా చేశారు కదా.. అలాంటి పదవిని వదులుకునే ఎవరిని చూసినా జాలే వేస్తుందిలెండి అంటారా? నిజమే. అయితే బీఎస్ యడియూరప్ప స్టైలే వేరు. సందర్భం ఏదైనా తనదైన శైలి హావభావాలను పలికించే యడ్డీ.. ఇప్పటికే చాలా సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకుని తనంత బేలతనం కలిగిన నేత మరెవరూ లేరని ఇప్పటికే ఫ్రూవ్ చేశారు.
ప్రమాణం.. రాజీనామా..
అటు సీఎంగా పదవీ ప్రమాణం చేయడమైనా, ఇటు సీఎంగా రాజీనామా చేయడమైనా.. యడ్దీకున్న రికార్డులు మరెవరికీ లేవనే చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాల్లో సీఎం పదవి చేపట్టిన తొలి బీజేపీ నేతగా యడ్డీకి ఘనమైన రికార్డే ఉంది. అంతేనా.. తనకు దక్కిన పదవిని ఎప్పటికప్పుడు ప్రమాదంలో పడేసుకుని రోజుల వ్యవధిలోనే సీఎం పదవికి రాజీనామా చేసిన విషయంలోనూ యడ్డీకి మంచి రికార్డే ఉంది. ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ లేకున్నా.. సీఎం కుర్చీ ఎక్కిన యడ్డీ.. మెజారిటీ నిరూపించుకోలేక రోజుల వ్యవధిలోనే దిగిపోయారు. ఆ సందర్భంగా ఆయన అసెంబ్లీ వేదికగానే కన్నీళ్లు పెట్టుకున్నారు.
యడ్దీ ఏం చేసినా వైరలే..
తాజాగా బీజేపీ అధిష్ఠానం నిర్ణయంతో సోమవారం కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన సందర్భంగానూ యడ్డీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత గవర్నర్ కు తన రాజీనామా లేఖను అందజేసి.. సీఎంఓ కార్యాలయ సిబ్బందితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సమయంలోనూ యడ్డీ ముభావంగానే కనిపించారు. ఆ తర్వాత అసెంబ్లీ హాలులోకి వెళ్లిన ఆయన.. అలా నేలపై కూర్చున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Must Read ;- బీజేపీకి పెద్దిరెడ్డి రాజీనామా.. ఈటల గెలిచి నిలిచేనా?










