తెలంగాణలో రాజకీయం మహా రంజుగా మారిపోయింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కేసీఆర్ తన మంత్రివర్గం నుంచి దాదాపుగా బహిష్కరించేసినంత పని చేయగా.. వ్యూహాత్మకంగా అడుగులు వేసిన ఈటల.. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి హుజూరాబాద్ ఉప ఎన్నికను అనివార్యం చేశారు. ఆ వెంటనే ఆయన బీజేపీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి అటు టీఆర్ఎస్.. అటు బీజేపీ హుజూరాబాద్ ను గెలిచి తమ సత్తా ఏమిటో నిరూపించుకొనే దిశగా వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ అందరి కంటే ఓ అడుగు ముందుగానే వేస్తూ.. హుజూరాబాద్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తనదైన శైలి యత్నాలను మొదలెట్టేసింది. టీఆర్ఎస్ కు ఏమాత్రం తగ్గని రీతిలో పోటీ ఇచ్చే దిశగా కదులుతున్న కమలదళం కూడా హుజూరాబాద్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇలాంటి కీల తరుణంలో బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చాలా రోజుల క్రితమే టీడీపీకి గుడ్ బై చెప్పి కమలదళంలో చేరిపోయిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి.. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసి ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి ఇటు టీఆర్ఎస్ లో చేరతారా? లేదంటే రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ లో చేరతారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఈటల చేరిన నాటి నుంచే అసంతృప్తి
వాస్తవానికి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి.. ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన ఈటల బీజేపీలో చేరేందుకు యత్నించిన సమయంలో ఆయన చేరికను పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈటలను పార్టీలో చేర్చుకుంటే తాను పార్టీ నుంచి వెళ్లిపోతానని కూడా కమలనాథులకు పెద్దిరెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి.. ఈటల చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని, ఉప ఎన్నికలో ఈటలను గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రంలో పార్టీ మరింతగా బలపడుతుందని పెద్దిరెడ్డికి నచ్చజెప్పారు. కేంద్ర మంత్రుల స్థాయిలో సర్దిచెప్పిన నేపథ్యంలో పెద్దిరెడ్డి మెత్తగబడక తప్పలేదు. పెద్దిరెడ్డి మెత్తబడగానే.. ఈటలకు కాషాయ కండువా కప్పేసిన బీజేపీ.. హుజూరాబాద్ బరిని మరింత రసవత్తరంగా మార్చేసింది. దుబ్బాక మాదిరే హుజూరాబాద్ లోనూ కాషాయ జెండాను ఎగురవేస్తామని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారతామని బీజేపీ నేతలు తమదైన శైలి వ్యాఖ్యలు చేశారు.
పెద్దిరెడ్డి లేకుండా ఈటల గెలిచేదెలా?
అయితే ఏమైందో తెలియదు.. ఏ వ్యూహాలు బెడిసికొట్టాయో తెలియదు గానీ.. ఉన్నట్టుండి సోమవారం సాయంత్రం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఇనుగాల పెద్దిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న సమయంలో పెద్దిరెడ్డి రాజీనామా చేయడంతో నిజంగానే ఇప్పుడు బీజేపీ పరిస్థితి అయోమయంలో పడిపోయినట్టైంది. అసలు పెద్దిరెడ్డి లేకుండా హుజూరాబాద్ లో మెజారిటీ ఓటింగ్ ను ఈటలకు మళ్లించడం ఎలా అనే ఆందోళన ఇప్పుడు కమలదళంలో మొదలైపోయింది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార పార్టీకి షాకులు ఇద్దామనుకుంటే.. అందుకు విరుద్ధంగా పెద్దిరెడ్డి రాజీనామాతో తమకే ఇబ్బంది వచ్చి పడిందన్న దిశగా కమలనాథులు హైరానా పడిపోతున్నారు. పెద్దిరెడ్డి లాంటి సీనియర్ దూరమయ్యాక.. బస్తీ మే సవాల్ అనేలా ఈటలను గెలిపించుకునేదెలా అన్న అంతర్మథనంలో బీజేపీ నేతలు పడిపోయారు. ఇదే దిశగా ఆలోచిస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా పెద్దిరెడ్డి లేకుండా హుజూరాబాద్ బైపోల్ లో ఈటల గెలిచేదెలా అంటూ లెక్కలేస్తున్నారు. మొత్తంగా హుజూరాబాద్ బరిని పెద్దిరెడ్డి మరింత రసకందాయంగా మార్చారని చెప్పక తప్పదు.
Must Read ;- అక్కడ టీఆర్ఎస్ ఓడితే!.. దళిత బంధు ఆగినట్టే!