Yediyurappa Resigns Karnataka CM Post :
రెండు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు ఈ నెల 26న పదవీ గండం పొంచి ఉందని చెప్పుకున్నాం కదా. ఆ గండం ఆ ఇద్దరినీ ఓ రేంజిలో టెన్షన్ పెడితే.. వారిలో ఒకరు తనదైన శైలిలో గండం నుంచి గట్టెక్కి ఇంకా సీఎం కుర్చీలోనే దిలాసాగా కూర్చోగా. మరొకరు మాత్రం గండం నుంచి గట్టెక్కలేక సీఎం పదవికి రాజీనామా చేసేశారు. గండం నుంచి గట్టెక్కిన సీఎంగా ఏపీ సీఎం జగన్ తేలితే.. గండం నుంచి గట్టెక్కలేక సీఎం పదవికి రాజీనామా చేసిన సీఎంగా కర్ణాకట సీఎం బీఎస్ యడియూరప్ప రికార్డులకెక్కారు. సోమవారం ఉదయం కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన యడ్డీ.. తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను రాజీనామా చేస్తున్నట్లుగా యడ్డీ సంచలన ప్రకటన చేశారు.
సీబీఐ అండతో జగన్ గట్టెక్కితే..
అంతా అనుకున్నట్లుగానే ఈ నెల 26(సోమవారం) నాడు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఎప్పటిలాగే జగన్ ను రక్షించడమన్న లక్ష్యంతోనే సాగుతున్న సీబీఐ తన కౌంటర్ ను సోమవారం కూడా దాఖలు చేయలేదు. తన కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని సీబీఐ కోర్టును కోరింది. దర్యాప్తు సంస్థ స్వయంగా మరోమారు కౌంటర్ కు గడువు కావాలని కోరడంతో విధిలేని పరిస్థితుల్లో కోర్టు ఈ పిటిషన్ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. వెరసి 26 గండాన్ని జగన్ తప్పించుకున్నారు.
గండం దెబ్బకు యడ్డీ రాజీనామా
ఇదిలా ఉంటే.. 26వ తేదీ నాటి గండానికి కర్ణాకట ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాత్రం అవుటైపోయారు. తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ యడ్డీ సంచలన ప్రకటన చేశారు. కర్ణాటక సీఎంగా నేటితో యడ్డీ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. సాధారణంగా ఈ తరహా వేడుకను ఘనంగా నిర్వహించుకునేందుకు యడ్డీ బాగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే సొంత పార్టీలోనే చెలరేగిన అసమ్మతి దెబ్బకు ఆ ప్లానింగ్ ను రద్దు చేసుకున్న యడ్డీ.. ఏకంగా తన సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదు. సోమవారం ఉదయమే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన యడ్డీ.. తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించనున్నట్లుగా తెలిపారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఆవేదనను మనసులోనే నొక్కి పెట్టేసుకున్న యడ్డీ.. తన రెండేళ్ల పాలనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Must Read ;- మిస్టరీ వీడింది!.. అరెస్టులు మొదలైనట్టే!