Sedition Case On 100 Farmers In Haryana :
అటు కేంద్రంలో.. ఆ పక్కనే హర్యానాలో బీజేపీనే అధికారంలో ఉంది. ప్రభుత్వాల తీరును ప్రశ్నిస్తున్న వారిపై ఆయా ప్రభుత్వాలు రాజద్రోహం (సెక్షన్ 124ఏ) కేసులు పెడుతున్న వైనంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కక్షసాధింపు చర్యలకే ప్రభుత్వాలు ఈ సెక్షన్ ను వినియోగిస్తున్నాయన్న కోణంలో సంచలన వ్యాఖ్యలు చేసిన జస్టిస్ ఎన్వీ రమణ.. దేశవ్యాప్తంగా ఓ ఆసక్తికర చర్చకు తెర లేపారు. ఇలాంటి కీలక తరుణంలో హర్యానాలోని బీజేపీ సర్కారు.. ఏకంగా 100 మంది రైతులకు రాజద్రోహం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ సెక్షన్‌పై జస్టిస్ రమణ సంచలన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కేసులు నమోదు కావడం గమనార్హం.
రైతులపై ఈ కేసులెందుకు?
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలను ప్రతిపాదించింది. వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తొలుత పంజాబ్ నుంచే ఈ ఆందోళనలు మొదలు కాగా.. దశలవారీగా ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ ఆందోళనలు ప్రధాని మోదీ క్రేజ్ ను దిగజార్చడమే కాకుండా.. మోదీ సర్కారు ప్రతిష్టను తీవ్రంగానే ప్రభావితం చేశాయి. అయినా కూడా మోదీ ఎక్కడా తగ్గడం లేదు. సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్న మోదీ.. వాటిలో మార్పుచేర్పులకు ఓ మోస్తరుగా అంగీకరించారు. అయినా ఆ దిశగానూ రైతులు ఆశించిన మేర అడుగులు పడలేదు. దీంతో నెలల తరబడి దేశ రాజధాని సరిహద్దుకు సమీపంగా హర్యానా, పంజాబ్ కేంద్రంగా ఇప్పటికీ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనల్లో భాగంగా చాలా రోజుల క్రితం హర్యానా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రణబీర్ పై దాడి జరిగింది. ఈ దాడికి బాధ్యులుగా 100 మంది రైతులను హర్యానా పోలీసులు గుర్తించారు.
ఇన్ని రోజులు కేసులు పెట్టలేదే
డిప్యూటీ స్పీకర్ పై దాడికి బాధ్యులుగా 100 మంది రైతులను గుర్తించిన హర్యాఏనా పోలీసులు బుధవారం దాకా ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు. అయితే రాజద్రోహం సెక్షన్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత… కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా సర్కారు ఆ 100 మంది రైతులపై రాజద్రోహం కేసులు నమోదు చేసింది. ఈ చర్య ద్వారా రాజద్రోహం సెక్షన్ ను తొలగించే దిశగా సుప్రీంకోర్టు యత్నిస్తే.. దానిని అడ్డుకుని తీరతామని బీజేపీ చెప్పడమేనా? అంటే.. ఈ విషయంలో న్యాయ వ్యవస్థతో పోరాటానికి కూడా వెనుకాడేది లేదన్న కోణంలోనే బీజేపీ సర్కారు ఈ సంచలన నిర్ణయం తీసుకుందా? అన్న దిశగా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
Must Read ;- జస్టిస్ ఎన్వీ సంచలనం.. ‘రాజద్రోహం’ పిచ్చోడి చేతిలో రాయి