భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఐదేళ్లుగా కలగానే మిగిలినప్పటికీ రియల్టర్లకు మాత్రం పంటపండిస్తోంది. ఎయిర్ పోర్ట్ పేరుచెప్పుకుంటూ ఐదేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉత్తరాంధ్ర జిల్లా కేంద్రాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో సాధారణ, చిత్తడి, చవట, కొండవాలు ప్రాంతాలను సైతం కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ కుబేరులుగా మారుతున్నారు. ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల భూములను గతంలో అప్పనంగా రియల్టర్లకు అప్పజెప్పిన రైతులు ప్రస్తుతం వాటి లావాదేవీలను చూస్తూ విస్తుపోతున్నారు.
రియల్టర్లకు ఊతమిస్తున్న ప్రభుత్వ ప్రకటనలు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015లో తొలిసారిగా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనలు వచ్చిన మరుక్షణంలోనే రియల్టర్లు ఈగల్లా వాలి విజయనగరం , శ్రీకాకుళం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని భూములన్నీ దొరికిన కాడికి, దొరికినంత రేటుకు కొనుక్కున్నారు. అనంతరం ప్రభుత్వం ఇదిగో , అదిగో ఎయిర్ పోర్ట్ అంటూ రెండు , మూడు నెలలకు ఎదోరూపంలో ప్రకటన జారీ చేస్తుండటంతో అదే అదనుగా భూముల రేట్లు రియల్టర్లు పెంచుకుపోతున్నారు.
నాలుగైదు రెట్లు పెరిగిన భూముల రేట్లు
భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రతిపాదన రాకముందు ఈ ప్రాంతంలో ఎకరా భూమి రేటు కోటి రూపాయలుండగా ఇప్పుడు ఐదారు కోట్లకు అమ్ముతున్నారు. అవకాశం ఉన్నచోటల్లా వెంచర్లు వేస్తూ ఇంకా ఎక్కువ రాబట్టుకుంటున్నారు. ఉత్తరాంధ్రలోని ఏ మారుమూల ప్రాంతంలో వెంచర్ వేసినా ‘కూత వేటు దూరంలో, అతి సమీపంలో , ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చేరువలో ‘ అంటూ బ్రోచర్లు ముద్రించి సొమ్ము చేసుకుంటున్నారు.
దిగులు చెందుతున్న రైతులు
భోగాపురం ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో ఒకనాడు భూములు కలిగిన రైతులు నేడు వాటిని చూసి దిగులు చెందుతున్నారు. 2003 – 2008మధ్య రియల్ భూమ్ సందర్భంగా ఇక్కడ భూముల రేట్లు అమాంతంగా పెరిగాయి. విశాఖకు 35 కి.మీ. దూరంలో చెన్నై – కలకత్తా జాతీయరహదారికి ఆనించివున్న ఈ ప్రాంతంలో 50లక్షల లోపు ఉన్న ఎకరాభూమి కోటి రూపాయలు పలికింది. అదే అదనుగా ఆ ప్రాంత రైతులు అత్యధిక మంది భూములను అమ్ముకున్నారు. ప్రస్తుతం వాటి రేటు ఆకాశానికి అంటుతుండటంతో వాటివైపు దిగాలుగా చూస్తున్నారు.
విశాఖ పరిపాలన రాజధాని ప్రకటనతో మరింత పైపైకి
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు తోడుగా వైసీపీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని ప్రకటించడంతో రియల్టర్ల ఆనందానికి హద్దులు లేవు , భూముల రేట్లకు అవధులు లేకుండా పోయాయి.
ఎయిర్‌పోర్ట్ మాట దేముడెరుగు
2023నాటికి ఎయిర్ పోర్టు పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రియల్టర్లు దేశ , విదేశాల్లోని భారతీయులను నెట్టింట పట్టుకుని ఈ మూడుజిల్లాలోని భూములను ఆన్ లైన్ లోనే కొనిపించేస్తున్నారు. ఈ ప్రాంత సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకునేందుకు స్థలం కొనుక్కోవాలనుకున్నా అసాధ్యంగా మార్చేశారు. అందువల్ల ఎయిర్‌పోర్ట్ మాట దేముడెరుగు , మా పరిస్థితి దుర్లభంగా మారుతోందని స్థానికులు వాపోతున్నారు.











