వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుసదాడుల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు గల్లీ నుంచి ఢిల్లీదాకా వేడి పుట్టించాయి. హనుమంతుడి చేయి విరిగితే నష్టమా, దుర్గగుడిలో పదికిలోల వెండి సింహాలు పోతే ఏమవుతుంది, అంతర్యేధిలో రథం దగ్ధం అయితే వచ్చే నష్టమే లేదు… అంటూ వైసీపీ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు హిందువుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. వైసీపీలోనూ చాలా మంది హిందువులు ఆందోళనకు గురవుతున్నారు. కొడాలిని కట్టడి చేయకపోతే ప్రజల్లో తిరగలేమని కొందరు వైసీపీ నేతలు నర్మగర్బంగా వ్యాఖ్యానిస్తున్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు.
పరాకాష్టకు చేరిన కొడాలి వ్యాఖ్యలు
హిందూ దేవాలయాలపై దాడులతో ఏపీలో హిందువులు ఆగ్రహంతో ఉన్నారు. ఇక వాటిపై కొడాలి వ్యాఖ్యలు ఆజ్యం పోశాయనే చెప్పాలి. వీటికి తోడు తాజాగా తిరుమలలో కొడాలినాని, ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. అయోధ్యలో మోదీ సతీసమేతంగా శంకుస్థాపన చేశాడా? ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్య సతీసమేతంగా హాజరయ్యారా అంటూ కొడాలి చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో ఆగ్రహం తెప్పించాయి. కొడాలిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ శ్రేణులు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ వర్గాలకు వీహెచ్పీ, ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ ధళ్ కూడా తోడు కావడంతో బీజేపీ చేపట్టిన ఉద్యమానికి మంచి ఊపొచ్చిందనే చెప్పాలి. బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేకపోయినా, హిందూ సంఘాలు దేవాలయాలపై దాడులను సీరియస్ గా తీసుకున్నాయని అర్థం అవుతోంది.
కొడాలి వ్యాఖ్యలతో వైసీపీకి తీరని నష్టం
కొడాలి చేసిన వ్యాఖ్యలు తప్పేనని వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాల్సి వచ్చింది. అంటే పార్టీకి నష్టం జరిగిందని, వదిలేస్తే ఇంకా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రహించిన వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. కొడాలి నాని వ్యాఖ్యలపై వారు కూడా తప్పుపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కొడాలి ఉద్దేశం కాదంటూ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు గ్రహించాల్సింది ఏమంటే…. కొడాలి వ్యాఖ్యలతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతానికి కొడాలి నాని సైలెంట్ అయ్యారు. వైసీపీపై హిందూ సమాజంలో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతోంది.
ఏపీలో 26 హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఇప్పటికీ ఒక్కరిని అరెస్టు చేసిన దాఖాలాలు లేవు. అంతర్వేది రథం దగ్దం అనంతరం దర్నాకు దిగి, ఒక చర్చి అద్దం పగలగొట్టిన భజరంగ్ దళ్, బీజేపీలకు చెందిన 40 మందిపై కేసులు పెట్టడంతో హిందువులకు విషయం అర్ధమైంది. ఈ ప్రభుత్వం క్రిస్టియానిటీకి కొమ్ముకాస్తోందని హిందువులు భావిస్తున్నారు. ఇప్పటికీ ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని నివారించకుండా కొడాలి నానిని హిందువుల మేదకు వదిలేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
నష్టనివారణకు దిగిన వైసీపీ
కొడాలి వ్యాఖ్యలతో వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇది గ్రహించిన అధిష్టానం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. కొడాలిని ఇక ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కొంత కాలం మీడియాకు దూరంగా ఉండాలని ఆదేశించారట. అందుకే ఇంత జరుగుతున్నా కొడాలి మీడియా ముందుకు రావడం లేదు. కొడాలి వ్యాఖ్యలు అతని వ్యక్తిగత మని పార్టీకి సంబంధం లేదని చెప్పాలని వైసీపీ అగ్రనేత సజ్జల రాజమకృష్ణా రెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించకపోవచ్చు. ఏదేమైనా కొడాలి వైసీపీకి మేలు చేయకపోగా తీవ్ర నష్టం చేస్తున్నారనే విషయం ఆ పార్టీ పెద్దలు గ్రహించారనుకోవచ్చు.
వైసీపీ కేడర్ మాత్రం.. కొడాలిని కంట్రోల్ చేయకపోతే.. పార్టీకి ముందు ముందు ఇంకా చాలా నష్టం జరుగుతుందనే అభిప్రాయంతోనే ఉన్నారు.











