ఏపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు తమ శాఖల్లో జరుగుతున్న పనులు, విషయంపై అవగాహన కన్నా విపక్షాలను తిట్టడమే ముఖ్యమైన పని అనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం జగన్ సర్కారులోని ఏ మంత్రి అయినా ఫలానా ప్రాజెక్టు గురించో, లేదా కార్యక్రమం గురించో వివరిస్తూ ప్రెస్ మీట్‌లు పెట్టిన దాఖలాలు చాలా తక్కువ. అసలు ఏ మంత్రులకు ఏ శాఖలు కేటాయించారో ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే వారికి టీడీపీ, జనసేన పార్టీల అగ్ర నేతలను దూషించడమే పని. విపక్ష నేత ఒక్క విమర్శ చేయగానే.. చటుక్కున అధికార పార్టీ మంత్రులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తుంటారు. కానీ, వారి వారి శాఖల పరంగా పెట్టిన ప్రెస్ మీట్లు వేళ్ల మీద లెక్కపెట్టేలాగే ఉంటాయి.
విపక్షాల మీద విరుచుకుపడడంలో మంత్రి అంబటి రాంబాబు ఎల్లప్పుడూ ముందుంటారు. ఆ విమర్శల్లోనూ నవరసాలు పలికిస్తూ, వింతైన హావభావాలతో ప్రెస్ మీట్‌ను రక్తి కట్టిస్తుంటారు. అలాంటి అంబటి.. తన శాఖలో ఓ ముఖ్యమైన పరిణామం జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఇంతవరకూ స్పందించలేదు. కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ రెండో గేటు డిసెంబరు 8 రాత్రి కొట్టుకుపోయింది. ఏడాది క్రితం ఒక గేటు కొట్టుకుపోగా, ఇప్పుడు మిగ్జాం తుఫాను ప్రభావం కారణంగా వచ్చిన వరద వల్ల మరో గేటు కొట్టుకుపోయింది. దీంతో నీరు వృథాగా సముద్రంలోకి పోతుంది.
గత సంవత్సరం కొట్టుకుపోయిన గేటునే బాగు చేయించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. దాన్ని తాత్కాలికంగా రిపేరు చేసి.. అప్పటి నుంచి గుండ్లకమ్మ రిజర్వాయర్ లో అసలు ఉండాల్సిన నీటి నిల్వ సామర్థ్యం 3.8 టీఎంసీలు ఉంచకుండా.. దాంట్లో సగమే సామర్థ్యంతోనే మెయింటేనే చేస్తున్నారు. మొన్న వచ్చి మిగ్జాం తుపాను ధాటికి వరద తాకిడి పెరగడంతో రెండో గేటు కొట్టుకుపోయింది. దీంతో నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి.. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు కానీ.. ఆ గేటు రిపేరు గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.
శాఖాపరంగా కనీస బాధ్యతతో స్పందించాల్సిన నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సైతం ఈ వ్యవహారంపై నోరు విప్పడం లేదు. దీంతో అసలు మంత్రులకు తమ బాధ్యతలపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతోంది.











