ఏపీలో మొన్నటిదాకా అధికారం వెలగబెట్టిన వైసీపీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజగురువుగా ప్రసిద్ధికెక్కిన విశాఖ శారదా పీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతికి నిజంగానే దెబ్బ మీద దెబ్బ పడిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో తనకు ఇష్టమైన వైసీపీకి ఘోర పరాజయం దక్కడంతోనే స్వరూపానందుడికి అపశకునం మొదలైపోయింది. ఆ తర్వాత జగన్ జమానాలో జరిగిన అక్రమాలన్నింటినీ సరిదిద్దే కార్యక్రమానికి టీడీపీ కూటమి సర్కారు పూనుకోవడంతో ఆయనకు ముచ్చెమటలు పట్టాయి. ఓ వైపు జగన్ హయాంలో జరిగిన కీలక దాడులపై లోతుగా దర్యాప్తు సాగిస్తున్న కూటమి సర్కారు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ సర్కారు ధారాదత్తం చేసిన సర్కారీ భూములను వెనక్కు తీసుకునే పనిని మొదలుపెట్టింది.
ఈ తరహా చర్యల్లో తొలుత స్వరూపానందుడిపైనే తొలి దెబ్బ పడిపోయింది. జగన్ జమానాలో విశాఖలోని శారదా పీఠం విస్తరణ కోసం అంటూ నగరంలోని 15 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను పీఠానికి కేటాయిస్తూ నాటి కేబినెట్ తీర్మానించింది. అయితే టీడీపీ అధినేత సీఎం కుర్చీలో కూర్చున్నంతనే శారదా పీఠానికి భూముల కేటాయింపునకు సంబంధించిన ఫైలును తనకు పంపాలంటూ ఆదేశాలు జారీచేశారు. అయితే అధికారుల్లోని కొందరు సదరు ఫైలు చంద్రబాబు వద్దకు చేరకుండా అడ్డుపడ్డారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు తాజాగా మొన్నటి కేటినెట్ భేటీలో ఏకంగా శారదా పీఠానికి విశాఖలో కేటాయించిన భూములను రద్దు చేస్తున్నామని తీర్మానం చేశారు. ఈ దెబ్బతో ఆ భూములు శారదా పీఠం నుంచి నేరుగా సర్కారీ ఖాతాలోకి వచ్చి పడిపోయాయి.
ఈ దెబ్బ నుంచి తేరుకునేలోగానే… శారదా పీఠానికి తిరుమలలో కేటాయించిన భూములు, వాటిలో శారదా పీఠం చేపడుతన్న నిర్మాణాలపైనా సమగ్ర నివేదికను ఇదివరకే ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. కూటమి సర్కారు ఆదేశాలతో ఇటీవలే రంగంలోకి దిగిన టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమలకొండపై శారదా పీఠం నిర్మాణాలపై నివేదిక ఇచ్చారు. గతంలో శారదా పీఠానికి ఇచ్చిన భూముల్లో భారీ నిర్మాణాలు చేపట్టిన పీఠం… 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో మరింత వేగాన్ని పెంచిందని నివేదించారు. అంతేకాకుండా కొండపై రోడ్డుతో పాటు కొంత మేర చెరువును సైతం పీఠం ఆక్రమించి మరీ నిర్మాణాలు చేపడుతోందని వివరించారు..దీంతో తిరుమలపై శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని టీటీడీ అదికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెరసి శుక్రవారం సాయంత్రం లోగా తిరుమల కొండపై స్వరూపానందుడి బృందం చేపడుతున్న నిర్మాణాలు నేలమట్టం కానున్నాయి.