నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు అవసరమని, అంతమేర నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తామంటూ విచిత్ర ప్రకటనలు చేసిన వైసీపీ సర్కారు… అమరావతి నిర్మాణాన్ని దాదాపుగా పక్కనపెట్టేసింది. వైసీపీ చెబుతున్న మాటలు నిజమేనేమోనని జనం కూడా అనుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ కూటమి సర్కారు… వైసీపీ చేసిందంతా దుష్ప్రచారమేనని ఆధారాలతో సహా నిరూపించేసింది. కేవలం నాలుగంటే నాలుగు నెలల్లోనే అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ.25 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించేసింది. అంతేనా…ఈ 4 నెలల వ్యవధిలోనే ఐదేళ్లుగా పడకేసిన అమరావతి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించింది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టు కట్టిన టీడీపీ… వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేేసింది. కూటమి పార్టీలతో కలిసి 164 సీట్లను గెలుచుకున్న టీడీపీ.. తన రీ ఎంట్రీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. పాలనలో అపార అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి సర్కారు… అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. మొన్నటి కేంద్ర బడ్జెట్ లో తమకు ఏం కావాలన్న అంశాలను ఎన్డీఏ సర్కారు ముందు ఉంచుతూనే.. రాష్ట్రానికి రాజధాని లేని విషయాన్ని పదే పదే గుర్తు చేసింది. రాజధాని నిర్మాణానికి తప్పనిసరిగా నిధులు కేటాయించాల్సిందేనని కూడా పట్టుబట్టింది. ఈ క్రమంలో రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లను ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ రుణానికి తానే కౌంటర్ గ్యారెంటీ ఇవ్వనున్నట్లు కూడా మోదీ సర్కారు ప్రకటించింది.
కేంద్రం ప్రకటించిన విధంగా అమరావతికి రుణాన్ని అందించే విషయాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకున్న ప్రపంచ బ్యాంకు ఇటీవలే తన ప్రతినిధి బృందాన్ని అమరావతి పంపింది. ఆ బృందం పరిశీలన తర్వాత అమరావతికి కేంద్రం ప్రతిపాదించిన మేర రుణాన్ని ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ఈ రుణంలో కొంత మేర ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి ఇప్పిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఏ బ్యావంకు నుంచి వచ్చినా… కేంద్రం ప్రకటించిన రూ.15 వేల కోట్లు అయితే త్వరలోనే అమరావతి నిర్మాణానికి అందనున్నాయి. ఈ నిధులు అందితే ఇప్పటికే ప్రారంభమైన అమరాతి నిర్మాణ పనుల్లో మరింత వేగం పుంజుకోనుంది.
ఇదిలా ఉంటే… ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పలువురు కేంద్ర మంత్రులతో పాటుగా ప్రముఖ రుణ సంస్థలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హడ్కో ప్రతినిధులతోనూ నారాయణ బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణం గురించి ఈ సందర్భంగా కీలక చర్చ జరిగింది. అమరావతి నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం, ప్రపంచ బ్యాంకు, ఏబీడీ నుంచి మంజూరైన రుణాల గురించిన ప్రస్తావన కూడా వచ్చింది. నానారాయణ బృందం ఇచ్చిన ప్రజెంటేషన్ తో సంతృప్తి వ్యక్తం చేసిన హడ్కో…అమరావతి నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు అక్కడికక్కడే అంగీకారం తెలిపింది. అటు ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి రూ.15 వేల కోట్లు, ఇటు హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు… రెండూ కలుపుకుంటే రూ.26 వేల కోట్లు అమరావతి నిర్మాణానికి అందివచ్చినట్టే. ఈ రెండు మొత్తాలుకూడా కేవలం నాలుగంటే నాలుగు నెలల్లోనే రావడం గమనార్హం.