ఏపీకి ఐదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించిన వైఎస్ జగన్ మోహన్ నెడ్డి నేతృత్వంలోని వైసీపీ జమానాలో ఆ పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. ఇష్టారీతిన వ్యవహరించిన నేతలు పెద్దా, చిన్న అన్న తేడా లేకుండా… తమ ముందు అందరూ దిగదుడుపే అన్నట్టుగా వ్యవహరించాయి. అక్కడితో ఆగి ఉన్నా ఫరవా లేదేమో. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు లాంటి సీనియర్ మోస్ట్ నేతను పట్టుకుని వైసీపీ నేతలు అనరాని మాటలు అన్నారు. ఈ తూటాల్లాంటి మాటల దెబ్బకు చంద్రబాబు… మీడియా ముందు బహిరంగంగా వెక్కివెక్కి ఏడ్చిన తీరు నాటి వైసీపీ అరాచక పాలనకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అయితే ప్రజాస్వామ్యంలో ఒక్కరే నిత్యం పదవిలో కొనసాగలేరు కదా. ఐదేళ్లు తిరగ్గానే… వైసీపీ పాలనపై విసుగు చెందిన ఏపీ జనం ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు. టీడీపీ ఆధ్వర్యంలోని కూటమికి రికార్డు మెజారిటీ విజయం కట్టబెట్టారు.
కూటమి విజయంతో చంద్రబాబు తిరిగి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు కేటినెట్ లో ఐటీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… విపక్షంలో ఉండగా రాసిన రెడ్ బుక్ ను బయటకు తీశారు. అయితే రెడ్ బుక్ అమలులో భాగంగా ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకంగా చర్యలు చేపట్టకుండా.. అన్ని చర్యలను చట్టానికి లోబడే తీసుకుంటున్నారు. దీంతో తప్పు చేసిన వారు కొంతకాలం పాటు ఉపశమనం పొందినా… చివరకు శిక్షకు గురి కావాల్సిందే కదా. ఇదే విషయాన్ని తెలుసుకుంటున్న పలువురు వైసీపీ నేతలు చిన్నగా ఆ పార్టీని వీడి… కూటమి పార్టీలో చేరిపోవడం ద్వారా తమను తాము రక్షించుకుంటున్నారు. ఈ తరహా నేతల్లోకి ఇటీవలే చేరిపోయిన వాసిరెడ్డి పద్మ లాంటి వారైతే… వైసీపీ జమానాలో తాము చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పుకుంటున్నారు.
వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీలో తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానన్న విషయాన్ని వాసిరెడ్డి పద్మ పూసగుచ్చినట్టు మీడియాకు వివరించారు.అంతేకాకుండా జగన్ ఎలాంటి మనస్తత్వం కలిగిన నేత అన్న విషయాన్ని కూడా ఆమె బయటపెట్టారు. తాజాగా ఆమె చంద్రబాబుకు క్షమాపణలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా టీడీపీ నేతలను ప్రత్యేకించి చంద్రబాబును ఎలా దూషించాలన్న విషయంపై వైసీపీ కీలక నేతలు పార్టీలోని పలువురు నేతలకు సూచించే వారని తెలిపారు. ఈ తరహా ఆదేశాలు తనకూ వచ్చాయన్న పద్మ…నాడు తాను మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో తాను చంద్రబాబునే కాదు.. ఏ ఒక్క టీడీపీ నేతను విమర్శించలేనని చెప్పానని తెలిపారు. తనను పదవి నుంచి తప్పించి పార్టీ నేతగా ఆదేశిస్తే విపక్ష నేతలపై విమర్శలు గుప్పించే అంశాన్ని పరిశీలిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక తాను మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న సమయంలో కమిషన్ నుంచి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన విషయం తనను ఎంతగానో బాధించిందని పద్మ తెలిపారు. ఈ విషయంపై తాను చంద్రబాబుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబును కలిసే అవకాశం వస్తే…ప్రత్యక్ష్యంగానే ఆయనకు క్షమాపణలు చెబుతానని కూడా పద్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తప్పు తెలుసుకున్న పద్మ తరహాలోనే చాలా మంది వైసీపీ నేతలు… తమ పార్టీ అధికారంలో ఉండగా…చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశామని, అలా చేయడం ముమ్మాటికీ తప్పేనన్న భావనలో ఉన్నారు. మరి ఈ తరహా నేతల్లో ఎంతమంది చంద్రబాబుకు క్షమాపణలు చెప్పి తమ తప్పును ఒప్పుకుంటారో చూడాలి.