బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్ సిద్దార్థ్ శుక్లా ఆకస్మిక మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. నలభై ఏళ్ల వయసులోనే అతను మృతిచెందాడు. ఈరోజు ఉదయం గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తరలించినట్టు అతని బంధువులు అంటున్నారు. అతనికి తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత బాలికా వధు సీరియల్ లో ప్రధాన పాత్రతో మంచి గుర్తింపు వచ్చింది. టీవీ షో ‘బాబుల్ కా ఆంగన్ చూటే నా’లో అవకాశం వచ్చింది. ఇలా అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు.
బిగ్ బాస్ సీజన్ 13 విజేతగా అందరి దృష్టిలోనూ పడ్డారు. 2014లో కరణ్ జొహార్ నిర్మించిన ‘హంప్టీ శర్మ కి దుల్హనియా’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆస్పత్రికి చేరుకునే లోపు ఆయన మృతిచెందినట్టు చెబుతున్నారు. చిన్నప్పట్నుంచీ అతనికి నటన మీద ఆసక్తి. ఇంటీరియర్ డిజైనింగ్ లో డిగ్రీ చేశారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలే వచ్చినా అంగీకరించి చేశారు. అనేక టీవీ షోలలో కనిపించారు. చివరిసారిగా ‘బ్రోకన్ బట్ బ్యూటీఫుల్ 3’ చేశారు. చిన్నవయసులోనే ఆకస్మాత్తుగా మృతిచెందడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
బయటికి మాత్రం గుండెపోటుతో చనిపోయినట్టుగానే వార్తలు వస్తున్నాయి. ఇంత చిన్న వయసులో గుండెపోటు ఎలా వస్తుంది? ఇంకేదో జరిగి ఉంటుందన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. గతంలో బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఆ కేసు పెద్ద సంచలనమైంది. అదే వయసున్న యువహీరో కావడంతోనే సిద్ధార్థ శుక్ల మరణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.











