ప్లాన్ లేకుండా పాన్ ఇండియా సినిమా తీస్తే ఇలానే ఉంటుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా బాహుబలిని చూసి బాలీవుడ్ అదే దారిలో వెళ్లి బొక్క బోర్లా పడింది. పరుగెత్తి పాలు తాగడం మంచిదా ? నిలబడి నీళ్లు తాగడం మంచిదా అనేది తేల్చుకోవాల్సింది నిర్మాతలే. దీనికి కారణం రాజమౌళేనా? అపజయం ఎరగని ధీరుడిలా రాజమౌళి దూసుకుపోతుంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు.
ఇంత బడ్జెట్ తో సినిమాలు తీయడం ఒకవిధంగా నేల విడిచి సాముచేయడమే. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి హిట్ కొట్టడం మంచిదా? భారీ బడ్జెట్.. కళ్లు చెదిరేలా గ్రాఫిక్స్ తో హిట్ కొట్టినా మిగిలేదెంత? ఇలాంటి లెక్కలన్నీ వస్తాయి. ఈ మధ్య కాలంలో ఐదారు భాషల్లో సినిమాలు తీసి వదలడం ఫ్యాషన్ గా మారిపోయింది. తక్కువ బడ్జెట్ తో తీసి ఎన్ని భాషల్లో రిలీజ్ చేసినా పోయేదేం లేదు.. డబ్బులు గుమ్మరించి తీసి సినిమా ఫ్లాప్ అయితేనే ప్రాబ్లమ్. ఇక్కడ కాంతార, కేజీఎఫ్ చిత్రాల గురించి కూడా మాట్లాడుకోవాలి. 16 కోట్లు పెట్టి తీసిన కాంతార దాదాపు 350 కోట్లు వసూలు చేసింది. ట్రిపుల్ ఆర్ 600 కోట్లు ఖర్చు పెట్టి తీస్తే 1151 కోట్లు వసూలు చేసింది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ వసూలు చేసింది అని లెక్కిస్తే కాంతార అనే చెబుతారు ఎవరైనా. పైగా కాంతార తక్కువ రోజుల్లో తీస్తే ట్రిపుల్ ఆర్ సంవత్సరాల తరబడి తీయాల్సి వచ్చింది.
హంగూ ఆర్భాటాలు లేకుండా కథ మీద, కథనం మీద దృష్టి పెట్టి సినిమా తీస్తే కోట్లు కొల్లగొట్టడం ఖాయం. ఇదే బాక్సీఫీసు ఫార్ములా. రాజమౌళి బాహుబలి తీసిన తర్వాత చాలా మంది బాలీవుడ్ నిర్మాతలు కూడా ఇదే దారిలో వెళ్లి చేతులు కాల్చుకున్నారు. రాజమౌళి కన్నా ముందే శంకర్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశాడు. షంషేరా, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, బ్రహ్మస్త్ర లాంటి సినిమాలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయో మన అందరికీ తెలుసు. బ్రహ్మస్త్ర మొదటి భాగం విడుదలైతే 425 కోట్లు వసూలయ్యాయి. కానీ ఈ చిత్ర నిర్మాణానికి అయిన ఖర్చు 400 కోట్లు పైమాటే. అలాగే షంషేరాకి 150 కోట్లు ఖర్చు చేస్తే 50 కోట్లు కూడా రాలేదు. ఇక లాల్ సింగ్ చడ్డా విషయానికే వద్దాం. 180 కోట్లతో అమీర్ ఖాన్ ఆ చిత్రాన్ని నిర్మిస్తే 46.4 కోట్లు మాత్రమే వసూలైంది. అంతకుముందు థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రాన్ని 300 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తే 150 కోట్లు కూడా రాలేదు. పైగా భారీ తారాగణమంతా ఇందులో ఉంది.
ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు ఇతర భాషల్లోనూ ఇలంటి పాన్ ఇండియా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా మంది ఇలాంటి సినిమాలు తీసి అప్పుల్లో మునిగిపోయారు కూడా. ప్రభాస్ బాహుబలి 2000 కోట్లు వసూలు చేస్తే రాధేశ్యామ్ కేవలం 100 కోట్లు మాత్రమే వసూలు చేసి నిర్మాతలకు నష్టాలే మిగిల్చింది. పైగా దీనికి 300 కోట్ల వరకూ ఖర్చు చేశారు. లైగర్ కూడా అంతే 110 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తే 70 కోట్లు కూడా రాలేదు. పైగా ఇవన్నీ గ్రాస్ లెక్కలే. షేర్ పరంగా చూస్తే ఇంకా తక్కువ వసూలైనట్టే లెక్క. వచ్చే ఏడాది మరిన్ని పాన్ ఇండియా సినిమాలు రానున్నాయి. ఎంతమంది మునుగుతారో ఎంత మంది తేలతారో వచ్చే ఏడాది తేలిపోతుంది. ఇంత ఖర్చు పెట్టి ఏ హాలీవుడ్ మార్కెట్ లోనూ సినిమాలు తీస్తే ఫరవాలేదు. దాని మార్కెట్ పరిధి పెద్దది కాబట్టి వర్కవుట్ అవుతుంది.
‘అవతార్’ను దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తే ప్రపంచవ్యాప్తంగా 14000 కోట్ల రూపాయలను ఆ సినిమా బాక్సాఫీసుల వద్ద కొల్లగొట్టింది. ఇక త్వరలో అవతార్ 2 రాబోతోంది. దీనికి 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఆ లెక్కన చూస్తే దీని వసూలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి. భారీ వసూళ్లు సాధిస్తే బాక్సాఫీసు రికార్డులను తిరగరాయడం ఖాయం. ఒకవేళ ఫ్లాప్ అయినా హాలీవుడ్ స్థాయిలో పెద్దగా పోయేదేమీ ఉండదు. చేసిన ప్రచారానికి కనీసం నిర్మాణ ఖర్చులైనా వచ్చేస్తాయి. కానీ మన ఇండియన్ సినిమా అలా కాదు. ఇంత ఖర్చు చేసిన మన సినిమా ఫ్లాప్ అయితే మునిగిపోవడమే.
రాజమౌళి సినిమాల నిర్మాణ వ్యయం సినిమా సినిమాకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా సెట్స్, గ్రాఫిక్స్, వీఎఫ్ ఎక్స్ వంటి వాటికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ బాబు హీరోగా సినిమా చేయాల్సి ఉంది. మరి ఈ సినిమాకి ఏ స్థాయిలో ఖర్చు చేస్తారో చూడాలి. ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమా తీసినా ఆ సినిమా ప్రమోషన్ కే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే పులిని చూసి నక్క వాతలా కాకుండా లెక్క చూసి సినిమా తీయడం ఎంతైనా మేలు. ముఖ్యంగా కాంతార సినిమాని చూసి అందరూ నేర్చుకోవలసిందే. ఏ లెక్క అయినా ఇక్కడ మాత్రం లక్ తోనే ముడిపడి ఉంది.