యూట్యూబ్ లో నుంచి పాటలు కూడా మాయమవుతుంటాయా? ఇప్పుడలాంటి వార్తే వైరల్ అవుతోంది. ‘రాంగ్ గోపాల్ వర్మ’ పేరుతో ఓ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. జర్నలిస్టు ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇది ఓ వివాదాస్పద చిత్రం. దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మను టార్గెట్ గా చేసి ఈ సినిమాని తీశారు. విషయమేమిటంటే ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారట. అది ఒక్కసారిగా అందులో నుంచి మాయం కావడం కూడా ఓ వివాదంగా మారింది. ఇందులో పబ్లిసిటీ స్టంట్ కూడా ఏమన్నా ఉందా అనే అనుమానం కూడా తలెత్తుతోంది.
ఒకసారి యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఆడియో గానీ వీడియో గానీ శాశ్వతంగా ఉండిపోతుంది… కారణాంతాల వల్ల యూ ట్యూబ్ యాజమాన్యం తొలగిస్తే తప్ప అది వన్ క్లిక్ అవే గా అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో అందుకు భిన్నమైన సంఘటన ఒకటి చర్చనీయాంశమైంది. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతులమీదుగా ఈ చిత్రం లోని ‘వర్మ వర్మ వర్మ… ఓ రాంగ్ గోపాల్ వర్మ’ అనే టైటిల్ సాంగ్ ను సెప్టెంబరు 2న విడుదల చేశారు. రెండో రోజుకు 7 వేల వ్యూస్ ఆ పాటకు వచ్చాయి. మరుసటి రోజు అంటే సెప్టెంబరు 3 సాయంత్రానికి యూట్యూబ్ నుంచి ఆ పాట మాయమైందట.
తొలుత ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకున్నారు. ఆ పాటను మార్కెట్ లో విడుదల చేసిన ఆడియో కంపెనీని ప్రభు సంప్రదిస్తే ‘సౌత్ అమెరికా లోని ఒక గ్యాంగ్ ఆ పాటను హ్యాక్ చేశారు.. యూట్యూబ్ చరిత్రలోనే ఇలా జరగటం ఇదే మొదటిసారి.. ఇలా ఎందుకు జరిగిందో, ఎవరు చేశారో తెలియదు. రెండు మూడు రోజుల్లో రెక్టిఫై సమస్య పరిష్కరిస్తాం’ అన్నారట. రెండు వారాల తర్వాత మాత్రమే ఆ పాట మళ్లీ యూ ట్యూబ్ లో కనిపించింది. తొలిసారి హ్యక్ జరిగింది అని చెప్పినప్పుడు 7000 వ్యూస్ సాధించిన ఆ పాట రెండోసారి రీలోడ్ అయినప్పుడు కేవలం మూడు రోజుల్లోనే 54 వేల వ్యూస్ పొందింది. అయితే ఈసారి పాట వస్తుంది గానీ గత 15 రోజుల నుంచి అదే 54 వేల వ్యూస్ తో కొనసాగుతోంది.
దాంతో ప్రభు మళ్లీ ఆడియో కంపెనీ సంప్రదిస్తే సరిచేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాధానం వచ్చింది. ఏం జరుగుతుందో తమకు అర్థంకావడం లేదని వారు నిస్సహాయత వ్యక్తం చేశారట. ఇలా ఒక లోడెడ్ కంటెంట్ ఒకసారి హ్యక్ అవ్వటం, మరో స్టక్ అవ్వటం యూట్యూబ్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఆడియో కంపెనీ అభ్యర్థన మేరకు ఈ విషయాన్ని మీడియా ముందుకు తీసుకువెళ్ళటానికి దర్శకనిర్మాత ప్రభు అంగీకరించలేదు. ఇలా జరగటం చిన్న విషయం కాదు ఎవరో కావాలని ఇలా చేస్తున్నారు.. కాబట్టి ఈ విషయాన్ని యూట్యూబ్ అథారిటీ దృష్టికి తీసుకు వెళ్ళమని మీడియా మిత్రులు సలహా ఇవ్వడంతో ఆ మేరకు జరిగిన విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. దీనికి యూట్యూబ్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది పబ్లిసిటీ స్టంట్ మాత్రం కాదని ఆ సినిమా వర్గాలు అంటున్నాయి.











