తొలగింపా.. కక్ష సాధింపా.. ఏపీలో రాజకీయం గంటకో రకంగా మారుతుంది. రామతీర్థం ఆలయంలో రాములవారి శిరస్సును ఖండించిన ఘటన రాజకీయ వేడిని రాజేసింది. చంద్రబాబు ఆలయ దర్శనానికి వెళ్తున్నానని ప్రకటించిన తర్వాత ఆలయాన్ని సందర్శించి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి రానట్టుంది. ఉన్నట్టుండి విజయసాయి.. చంద్రబాబుకు పోటీగా.. ఇంకా చెప్పాలంటే ఆయనకంటే ముందు అక్కడికి చేరుకుని చంద్రబాబును ఏదో తక్కువ చేసే ప్రయత్నం బాగానే చేశాడు. అది కాస్త అంతగా పేలినట్లు అనిపించలేదేమో పాపం.. ఆ పాపాన్ని ప్రతి పక్షాలపై నెడతామని కూడా బాగానే ప్రయత్నించారు విజయసాయి రెడ్డి. అది కూడా అంతగా జనాలు పట్టించుకున్నట్లు అనిపించకపోవడంతో.. ఇక చివరగా ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్ని అశోక్ గజపతి రాజు గారిపైన పడ్డారు.
తొలగింపు సరా..
టీడీపీని బాధ్యులను చేయాలనే పాచిక పారకపోవడంతో.. కనీసం టీడీపీ నేతపైన అయినా బురద జల్లి సంతృప్తిపడడానికి ప్రయత్నిస్తుంది అధికార పార్టీ. అందులో భాగంగా రామతీర్థంతోపాటు పైడితల్లి, మందపల్లీ ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతి రాజును తొలగిస్తున్నట్లుగా ప్రభత్వం హడావిడిగా జీవో జారీ చేయడం చర్చానీయాంశమైంది. రాముని విగ్రహం ధ్వంసం కాకుండా అశోక్ గజపతి రాజు అడ్డుకోలేకపోయిన కారణంగా.. ఆయనపై వేటు వేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు పేర్కొంటుంది జగన్ సర్కారు. భద్రతా పరంగా వైఫల్యంతో పాటు.. ఆ తర్వాతి పరిస్థితిని చక్కబెట్టడంలో కూడా అశోక్ గజపతి విఫలమయ్యారనీ.. వీటినంతా పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు జీవో పేర్కొనడం గమనార్హం.
సెంచురీ కొట్టేసారు..
నేటి మూడు దేవాలయాలతో కలిసి అశోక్ గజపతి రాజును మొత్తంగా 100 దేవాలయాలు ఛైర్మన్ పదివి నుండి తొలగించారు. గతంలో సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ నుంచి హఠాత్తుగా అశోక్ గజపతి రాజును తొలగించి.. హడావిడిగా ఎవరికీ తెలియకుండా.. ఎవరికీ ప్రశ్నించే తావు కూడా ఇవ్వకుండా దివంగత ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయితను నియమించడంపై అప్పట్లో విమర్శులు ఎదుర్కుంది ప్రభుత్వం. అక్కడితో ఆగకుండా అశోక్ గజపతి రాజు ట్రస్టీగా వ్యవహరిస్తున్న అన్ని పదవుల నుండి తొలగిస్తూనే ఉంది ప్రభుత్వం. నేటితో మొత్తానికి సెంచరీ కొట్టింది ప్రభుత్వం.
రామతీర్థ సంఘటన సాకు మాత్రమే..
రామతీర్థ సంఘటన గత కొద్దిరోజులుగా రగులుతూనే ఉంది. దానిపై నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న ప్రభుత్వం హఠాత్తుగా చంద్రబాబు దర్శనార్ధం వెళ్తున్న ప్రకటన వెలువడగానే.. ఉన్నట్టుండి ఏదేదో చేయాలని ప్రయత్నిస్తునడంలో సందేహం లేదు. ఒకవేళ రామతీర్థ ఘటనపై స్పందించే ఉద్దేశాలు ప్రభుత్వానికి ఉంటే అది జరిగిన రోజునో.. లేక తర్వాతి రోజునో ఇలాంటి తొలగింపు చర్యలు తీసుకుని ఉంటే.. అది ఘటనకు అతికినట్టు సరిపోయేది. కానీ ప్రతి పక్షం కదిలిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే ఏమీ చేయలేక చివరకి కక్ష సాధించడానికి చేసిందని చెప్పాల్సిన అవసరం లేకుండానే అందరికీ తెలుస్తూనే ఉంది.
అనుకుంటే మాకేంటి?
ఏమన్నా అనుకోండి.. మాకేంటి అన్నట్లుగానే ఉంది ప్రభుత్వ తీరు. ఇన్ని రోజుల తర్వాత ప్రతి పక్ష నేతను ఛైర్మన్ పదివి నుండి తొలగించడం కక్ష సాధింపు చర్య లేక గుడి ఘటనకు సంబంధించిన చర్యలా అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా సరే.. మాకేంటి.. మేమిలాగే చేస్తాం అన్నట్లు ఉంది ప్రభుత్వ తీరు. అయినా చర్యలు తీసుకోవాల్సింది ఛైర్మన్ పైనా.. శిరస్సు ఖండించిన దుండగుల పైనా అని ప్రజలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఈ మాత్రం లాజిక్ కూడా మన ప్రభుత్వానికి తెలియడం లేదు.
Also Read: మంత్రి వెల్లంపల్లి అనుచిత వ్యాఖ్యలకు టీడీపీ నిరసన